పాన్ ఇండియా హీరో అవ్వాలంటే క్రేజ్ తో పాటు అదృష్టం కావాలి. అంతకంటే ముందు మంచి ప్లానింగ్ ఉండాలి. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాడు హీరో రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ నుంచి పూర్తిగా పాన్ ఇండియా అప్పీల్ ను దృష్టిలో పెట్టుకొని లైనప్ సెట్ చేసుకుంటున్నాడు ఈ హీరో. ఇందులో భాగంగా లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పే పనిలో ఉన్నాడు.
రామ్ చరణ్ కు బాలీవుడ్ కొత్త కాదు. చాలా ఏళ్ల కిందటే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కల్ట్ క్లాసిక్ జంజీర్ ను రీమేక్ చేశాడు. ఏకంగా ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నాడు. అయితే దాని ఫలితం తేడా కొట్టింది. దీంతో పూర్తిగా టాలీవుడ్ కు పరిమితమైపోయాడు మెగా పవర్ స్టార్.
ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ సెట్ అయిందో, ఇక అప్పట్నుంచి చరణ్ ప్లానింగ్ మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్లీ లోకల్ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యాడు ఈ హీరో. ఇందులో భాగంగా దర్శకుడు శంకర్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో మరో పాన్ ఇండియా సినిమా సెట్ చేశాడు. హిందీ జెర్సీ తో గౌతమ్ కూడా నేషనల్ లెవెల్ డైరక్టర్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమాల తర్వాత మరోసారి పూర్తిస్థాయిలో బాలీవుడ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు చరణ్. దానికి సంబంధించి ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. రీసెంట్ గా చరణ్, ముంబయి వెళ్లింది కూడా ఈ ప్రాజెక్టు చర్చల కోసమే అనే టాక్ వినిపిస్తోంది. మొత్తమ్మీద చరణ్ పాన్-ఇండియా లైనప్ మాత్రం అదిరింది.