ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా ఎవ్వర్ని వరిస్తుందో అస్సలు చెప్పలేం. బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న సినిమా డిజాస్టర్ అవుతుంది. వద్దనుకున్న సినిమా సూపర్ హిట్ అవుతుంది. నాగచైతన్య విషయంలో అదే జరిగింది. జోష్ సినిమాతో హీరోగా పరిచయమైన ఈ అక్కినేని హీరో, తొలి సినిమాతోనే ఫ్లాప్ అందుకున్నాడు.
జోష్ కథను వాసు వర్మ రాసుకున్నాడు. ఆ కథను రామ్ చరణ్ హీరోగా తీయాలనుకున్నాడు దిల్ రాజు. అనుకున్నదే తడవుగా వెళ్లి చరణ్ కు కథ వినిపించాడు. చెర్రీకి కథ బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పాడు కూడా. కానీ చిరంజీవికి మాత్రం ఆ కథ నచ్చలేదు. సెకెండాఫ్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పిన చిరంజీవి.. అప్పటి కాలమాన పరిస్థితుల్లో చరణ్ కు జోష్ కథ కరెక్ట్ కాదని చెప్పారట.
ఎందుకంటే, చరణ్ అప్పుడు మగధీర షూటింగ్ లో ఉన్నాడు. అది చరిత్ర సృష్టించబోతోందనే విషయాన్ని చిరంజీవి అప్పుడే గ్రహించారు. అలాంటి మూవీ తర్వాత జోష్ రావడం కరెక్ట్ కాదంటూ రిజెక్ట్ చేశారు. ఇదే అభిప్రాయాన్ని నాగబాబు కూడా వ్యక్తం చేశారట.
అలా చిరంజీవి, చరణ్ వదులుకున్న కథను తీసుకెళ్లి నాగార్జునకు వినిపించాడట దిల్ రాజు. నాగార్జున వెంటనే జోష్ కథకు కనెక్ట్ అయ్యాడు. కాలేజ్ గొడవలు, స్టూడెంట్ గ్యాంగ్ వార్స్ అనేసరికి నాగ్ కు అతడి టర్నింగ్ పాయింట్ శివ సినిమా గుర్తొచ్చింది. అలాంటి కథ కొడుకు ఎంట్రీకి దొరకడంతో సంబరపడ్డాడు. కానీ చిరంజీవి చెప్పిన సెకండాఫ్ మిస్టేక్స్ ను మాత్రం నాగ్ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఫలితం ఏమైందనేది అందరికీ తెలిసిందే. అన్నట్టు కొత్తబంగారులోకం కథ ముందుగా నాగచైతన్య డెబ్యూ కోసం అనుకున్నారట. అది నాగార్జునకు నచ్చలేదు. జోష్ నచ్చింది. ఏ సినిమా ఎవరికి రాసిపెట్టుందో చెప్పలేం కదా.