రియల్ లైఫ్ తండ్రికొడుకులు చిరంజీవి-రామ్ చరణ్. ఎప్పుడూ కలిసే ఉంటారని చాలామంది అనుకుంటారు. కానీ ఈ తండ్రికొడుకులు ప్రతి రోజూ కలుసుకోరు. ఇంకా చెప్పాలంటే అతి కష్టమ్మీద వీకెండ్స్ మాత్రమే కలుసుకుంటారు. ఈ విషయాల్ని స్వయంగా చరణ్ బయటపెట్టాడు. అంతేకాదు..తన తండ్రితో ఈ మధ్య కాలంలో గడిపిన మధుర క్షణాల్ని గుర్తుచేసుకున్నాడు.
“నేను, నాన్న వేరువేరుగా ఉంటున్నాం. గడిచిన నాలుగేళ్లుగా మేం వేర్వేరుగానే ఉంటున్నాం. ఆదివారాలు మాత్రం కలుస్తాం. అలాంటిది ఆచార్య సినిమా షూటింగ్ వల్ల 18 రోజులు కలిసి ఉన్నాం. ఇద్దర్నీ ఒకే కాటేజీలో పెట్టారు. ఇద్దరం కలిసే ఉన్నాం. కలిసి లేవడం, కలిసి జిమ్ చేయడం, కలిసి భోజనం చేయడం, కలిసి నిద్రపోవడం.. ఇలా 18 రోజులు నాన్నతో ఫుల్ గా గడిపే అవకాశం దక్కింది. నా జీవితంలో మోస్ట్ మెమొరబుల్ టైమ్ అది. ఎంత చెప్పినా నా ఫీలింగ్ ను మాటల్లో చెప్పలేను. మేం కలిసి ఉంటున్న 5 రోజుల తర్వాత నాన్న కూడా అదే మాట అన్నారు. మళ్లీ ఎప్పుడిలా కలుస్తామో తెలీదు. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం అన్నారు. ఆయన మాటలకు నా కళ్లలో నీళ్లు తిరిగాయి.”
ఇలా ఆచార్య సినిమా టైమ్ లో మారేడుమిల్లిలో తండ్రితో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకున్నాడు చరణ్. ఆ టైమ్ లో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో.. తండ్రితో గడపడానికి తనకు మరింత సమయం దక్కిందని, జీవితంలో ఆ రోజుల్ని మరిచిపోనని అన్నాడు చరణ్.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్, కొరటాల శివ కలిపి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు చరణ్. ఈనెల 29న థియేటర్లలోకి రానుంది ఆచార్య