రామ్ చరణ్, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత, తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ న్యూజిలాండ్‌లో తిరిగి ప్రారంభమైంది. చరణ్ తో పాటు, హీరోయిన్ కియరా అద్వానిపై ఈ షెడ్యూల్ చేశారు.
తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసిన రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. అద్భుతమైన విజువల్స్ రూపొందించడానికి టీమ్ చేసిన ప్రయత్నాలను అతడు ప్రశంసించాడు. కియారా అద్వానీని ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్టైలిష్ లుక్‌లో ఉన్న చిత్రాన్ని రామ్ చరణ్ పంచుకున్నాడు.
ఈ షెడ్యూల్ లో మేకర్స్ ఒక ప్రత్యేకమైన పాట, హీరోహీరోయిన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో పూర్తి చేశారు. సినిమా మొత్తానికి అత్యంత కాస్ట్ లీ సాంగ్ ఇదేనంట. తాజా సమాచారం ప్రకారం, ఈ పాట కోసం మేకర్స్ దాదాపు 15 కోట్లు ఖర్చు చేశారు.
తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను, అందమైన దృశ్యకావ్యంగా చిత్రీకరించాడట శంకర్. సిల్వర్ స్క్రీన్ పై ఈ సాంగ్ కన్నులపండువగా ఉండబోతోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తారు. జయరామ్, శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.