ముస్లింలకు ఎంతో పవిత్రమైనది రంజాన్ మాసం. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేస్తూ అల్లాను ప్రార్థిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెలలో రంజాన్ పాటిస్తారు. ప్రతియేటా రంజాన్ ప్రారంభమయ్యే రోజు మారుతూ ఉంటుంది. సౌదీ అరేబియా దేశా ప్రకటనను ప్రామాణికంగా తీసుకుని రంజాన్ పవిత్ర మాసాన్ని ప్రారంభిస్తారు.
ఈ క్రమంలో సౌదీ అరేబియా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి నెలవంక దర్శనమిచ్చింది. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి సౌదీ సహా పలు దేశాల్లో ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు.
కాగా.. భారత్‌లో శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో.. ఈ నెల 3 నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు మొదలుకానున్నాయి. ఇప్పటికే మసీదులను అందంగా ముస్తాబు చేశారు. హైదరాబాద్‌లోని మక్కా మసీదును విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో రంజాన్ ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మాసంలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం కొనసాగిస్తారు. అల్లాహ్ జ్ఞాపకార్థం తమ సమయాన్ని వెచ్చిస్తారు.
ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాలకు సహరీతో రోజా ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు ఇఫ్తార్‌తో ఉపవాస దీక్ష ముగుస్తుంది. మళ్లీ ఇదే విధంగా.. సమయంలో కొద్దిపాటి మార్పులతో నెలరోజులపాటు రోజాను పాటిస్తారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం మైనారిటీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో ఉద్యోగులు ప్రతి రోజూ సాయంత్రం గంట ముందే విధులు ముగించుకుని వెళ్లేందుకు అనుతించింది. రంజాన్ మాసం మొత్తం ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.
Advertisements
అలాగే, రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు తేవాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ‘గంగజమునా తెహజీబ్’ మరింతగా పరిఢవిల్లాలన్నారు. దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని సూచించారు.