తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా భూములను రిక్రియేషనల్ జోన్ గా ప్రకటించడాన్ని ప్రశ్నిస్తూ రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వ్యవసాయ భూములను లాక్కొని పంట పండించుకునే వారిని ఆందోళనకు గురి చేసి వారి కోపానికి కారణమైన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ కేసును హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నట్లు రైతుల తరుఫున న్యాయవాది సృజన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ను చూస్తే కేవలం రైతుల పట్టా భూములను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని అన్నారు.
ఇదే రామేశ్వర్ పల్లి రెవెన్యూ గ్రామంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టణాభివృద్ధి అవకాశ ప్రాంతం గా చూపించడం అనేక అనుమానాలకు తావిస్తుందని కేసు వేసిన రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆలోచనను విరమించుకొని రైతుల భూముల జోలికి రావొద్దని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అవసరమైతే సుప్రీం కోర్టు కైనా వెళ్తామని హెచ్చరించారు.