హైదరాబాద్‌లోనే వర్మ జీఎస్టీ షూట్, ఇదిగో సాక్ష్యం

జీఎస్టీ విషయంలో వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు జైలుశిక్ష తప్పదా? ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో షూట్ చేసినట్టు బలంగా వినిపిస్తోంది. షూట్ చేశారనడానికి తనవద్ద ఆధారాలున్నాయని, తాను నిరూపిస్తానని ఓ మహిళ సామాజికవేత్త సవాల్ చేశారు. దీన్ని చిత్రీకరించిన హోటల్‌పై కూడా న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు. అదేగనుక జరిగితే వర్మ అరెస్ట్ కావడం తథ్యం.

పోర్న్ చిత్రాన్ని షూట్ చేసినందుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు ఉద్యమిస్తున్న తరుణంలో ఆయన చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇకపై తన తరపున తన లాయరే అంతా చూసుకుంటాడని వర్మ ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చినప్పటికీ ఐద్వా, పీఓడబ్ల్యూ, మహిళా సమాఖ్య వంటి సంఘాలు ఆయన్ని తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు విశాఖలోని ఎంవీవీ కాలనీ పీఎస్‌లో వర్మపై కేసు నమోదైన విషయం తెల్సిందే! మహిళల గౌరవాన్ని ఆయన కించపరిచారని ఈ సంఘాలు పోలీసులకు సమర్పించిన తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. పైగా మహిళా సంఘం నేత మణి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వర్మపై ఐపీసీలోని 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాను ఇండియాలో ఈ మూవీ షూట్ చేయలేదని వర్మ హైదరాబాద్ పోలీసుల ఇంటరాగేషన్‌లో తెలిపినప్పటికీ ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలతో మహిళాసంఘాలు ముందుకు వెళ్తున్నాయి.