మెగసెసె అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త సందీప్ పాండేను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సందీప్ పాండే సీఏఏ, ఎన్.ఆర్.సి లకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిరసన ర్యాలీ తీస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న సందీప్ పాండే, మరో తొమ్మిది మందిని పోలీసులు చుట్టు ముట్టి వ్యాన్ లో వేసుకెళ్లారు. నిషేధాజ్ఙలు ఉల్లంఘించినందుకు సెక్షన్ 151 కింద సందీప్ పాండేను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పర్చనున్నారు.
సందీప్ పాండే సీఏఏకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న ర్యాలీలో పాల్గొంటున్నారు. పాండే అతని అనుచరులు కలిసి కరపత్రాలు కూడా పంచారు. హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సందీప్ పాండే పై గత నెలలో కేసు నమోదైంది. హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయనపై రెచ్చగొట్టే ప్రసంగాలు, అల్లర్లకు కారకుడు, ప్రజలను రెచ్చగొడుతున్నాడంటూ పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
బెనారస్ హిందూ యూనివర్సిటీ, కాల్పోర్నియా మాజీ విద్యార్ధి అయిన సందీప్ పాండేకు 2002 లో రామన్ మెగసెసె అవార్డ్ దక్కింది.