రంపచోడవరం : గోదావరిలో బోటు బోల్తా ప్రమాద ఘటనకు సంబంధించిన నిందితులలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ‘ఈ కేసులో బోటు యజమానితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం. లాంచీ యజమానుల్లో ఏ-వన్‌గా ఉన్న కోడిగుడ్ల వెంకటరమణతో పాటు ఏ-2 ఎల్లా ప్రభావతి, ఏ-3 అచ్యుతమణిని అరెస్ట్ చేశాం. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ చేస్తున్నాం’ అని రంపచోడవరం ఏఎస్పీ వకుళ్ జిందాల్ చెప్పారు.
‘గోదావరి ప్రవాహ ఉధృతిని బోటు డ్రైవర్ అంచనా వేయలేకపోవడం, సుడులు తిరుగుతున్న నీటి నుంచి తప్పించుకుని, సురక్షిత మార్గంలో బోటును ముందుకు తీసుకువెళ్లే విషయంలో బోటు డ్రైవర్‌కు సరైన అవగాహన, అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఎడమ పక్కకు వెళ్లాల్సిన బోటును గోదావరి మధ్యలో నడిపారు. ఇందులో పోలీసుల తప్పిదం లేదు. పోలీసులు తనిఖీ చేసినప్పుడు బోటులోని వారంతా లైఫ్ జాకెట్లు వేసుకున్నారు. పోలీసులు వెళ్లగానే లైఫ్ జాకెట్లు తీసేయవచ్చని బోటు సిబ్బంది చెప్పారు. బోటులో మొత్తం 64మంది పెద్దవాళ్లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 8మంది బోటు సిబ్బంది సహా 75మంది ఉన్నారు. బోటును బయటకు తీసుకు వచ్చేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ 34 మృతదేహాలు వెలికి తీశాం’ అని ఏఎస్పీ చెప్పారు.