ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ ఇవ్వలేదు రామ్. అతడు నటించిన రెడ్ సినిమా ఫ్లాప్ కాకపోయినా, మరీ పెద్ద హిట్ మాత్రం కాదు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు వారియర్ అనే సినిమా చేస్తున్నాడు. అయినప్పటికీ రామ్ సినిమాకు భారీగా బిజినెస్ జరుగుతోంది. అతడి సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ కు ఇప్పుడు 50 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది.
లింగుసామి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమా వారియర్. లింగుసామికి యాక్షన్ సినిమాలు బాగా తీస్తాడనే పేరుంది. ఇక వారియర్ లో రామ్ కూడా పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. వీటికి తోడు స్టార్ హీరోయిన్ కృతి శెట్టి ఉండనే ఉంది. మ్యూజిక్ డైరక్టర్ గా దేవిశ్రీ వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ కు ఇంత డిమాండ్. తమిళ్ కూడా కలిపితే ఈ రేటు ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం 50-55 కోట్ల రేషియోలో వారియర్ సినిమా నాన్-థియేట్రికల్ టాక్స్ నడుస్తున్నాయి. జీ స్టుడియోస్ సంస్థ ఈ మేరకు చర్చలు జరుపుతోంది. నిజానికి శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్, ఆడియో అంటూ విడివిడిగా అమ్ముకుంటే ఇంతకంటే ఎక్కువ మొత్తమే వస్తుంది. కానీ ఒకే ఛానెల్ తో బల్క్ డీల్ చేసుకుంటే ఓ పనైపోతుందని నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఆలోచన.
త్వరలోనే వారియర్ సినిమా రైట్స్ పై ఓ క్లారిటీ వస్తుంది. ఈ సినిమానే 50 కోట్ల మార్క్ అందుకుంటే, త్వరలోనే రాబోతున్న రామ్-బోయపాటి సినిమాకు రేటు మరో 30 కోట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.