టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పై సంచలన వ్యాక్యలు చేశారు కేసీఆర్ అన్న కుమార్తె రమ్య రావు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆమె.. సంతోష్ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. అడ్డదారిన రాజ్యసభకు ఎన్నికై.. రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.
ప్రస్తుతం సంతోష్ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్నారని.. ఆయన వేధింపులతో రాష్ట్రంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బంజారాహిల్స్ లో బీసీగా చెప్పుకుని 2 గుంటల భూమిని ప్రభుత్వం నుంచి పొందారని ఆరోపించారు. సంతోష్ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని.. 2007లో తాను కొనుగోలు చేసిన భూమిని గోల్డ్ మైన్ కంపెనీ పేరుతో కాజేశారని విమర్శించారు. మైనింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కుమ్మక్కై మాఫియా రాజ్యాన్ని సంతోష్ నడుపుతున్నారని ఆరోపించారు.
తన అడ్డగోలు వ్యవహారాల కోసం ఏజీపీ రామచంద్రరావును సంతోష్ నియమించుకున్నారని అన్నారు రమ్య రావు. ఆయన సంతోష్ భార్యకు మేనమామ అవుతారని చెప్పారు. ఎంపీ సంతోష్ చేసే అనైతిక కార్యకలాపాలు కేసీఆర్ కు కనపడటం లేదా అని ప్రశ్నించారు. తాము మాత్రం వదిలేది లేదని కోర్టుకు వెళ్తాం.. లీగల్ గా ఫైట్ చేస్తామని తెలిపారు. ఎంపీ సంతోష్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆయన తండ్రి రవీందర్ రావు జిల్లాను.. సంతోష్ రాష్ట్రాన్ని శాసిస్తున్నారని మండిపడ్డారు.
తన బినామీలుగా తమిళనాడు వాసులను సంతోష్ పెట్టుకున్నారని ఆరోపించారు రమ్య రావు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి నిఘా సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 2018 ఎన్నికల అఫిడవిట్ లో రూ.5 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పిన సంతోష్.. లండన్ లో రూ.100 కోట్లు పెట్టి విల్లా కట్టుకుంటున్నారని ఆరోపించారు. అతని అక్రమాలపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కేంద్రానికి సంతోష్ సహకరిస్తున్నారు కాబట్టే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు.
ఇక సంతోష్ బాబాయి గండ్ర రమణ రావు, చెల్లెలు సౌమ్యలకు భూములు లేకపోయినా మిడ్ మానేరు ముంపు గ్రామాల దగ్గర పట్టాలు వచ్చాయని అన్నారు రమ్యరావు. సంతోష్ ఆస్తులు చూస్తే దిమ్మతిరగాల్సిందేనని.. అతని అవినీతి, అక్రమాలపై ఆధారాలు ఇస్తా చర్యలు తీసుకునే దమ్ముందా? అని సవాల్ చేశారు.