హెడ్డింగ్ చూసి కంగారు పడకండి. కేసీఆర్ మనవడు హిమాన్షును టచ్ చేసే వాడు ఎవడు అని ఆలోచించకండి. ఇక్కడ కనిపించకుండా పోయింది.. కేసీఆర్ అసలు మనవడు హిమాన్షు కాదు. ఆయన అన్న కుమార్తె రమ్య రావు కుమారుడు రితేష్ రావు.
అసలేం జరిగింది..?
రాష్ట్రంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని ఎన్ఎస్ యూఐ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఎన్ఎస్ యూఐ ముఖ్య నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లు ఎక్కడ ఉన్నారనేది తల్లిదండ్రులకు తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. వారిలో రమ్య రావు కుమారుడు రితేష్ రావు కూడా ఉన్నారు.
తొలి వెలుగుకు కాల్ చేసిన రమ్య రావు
ఈ ఘటనపై తొలివెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడారు రమ్య రావు. పోలీసులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని.. కాంగ్రెస్ నేతలకు కూడా ఎటువంటి సమాచారం లేదన్నారు. అందుకే తొలివెలుగును సంప్రదించానని చెప్పారు. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత రెండు వాహనాల్లో పోలీసులు వచ్చారని రితేష్ గురించి అడిగారన్నారు. అతను లేడు అని చెప్పినా వినకుండా ఇళ్లంతా క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు. ఆఖరికి భవనం పైన వాటర్ ట్యాంక్ లోపల కూడా వెతికారని వివరించారు.
డీజీపీ, ప్రభుత్వానికి డెడ్ లైన్
ఇప్పటివరకు రితేష్ ఆచూకీ లేదన్నారు రమ్య రావు. అన్ని పీఎస్ లకు తమ మనుషులను పంపామని.. ఒకచోటకు వెళ్తే.. ఇంకోచోట ఉన్నారని.. అక్కడకు వెళ్తే మరో చోట ఉన్నారని తిప్పించారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కూడా విద్యార్థులను దుర్భాషలాడుతూ ఇబ్బంది పెడుతున్నారని ఫైరయ్యారు. వందలు, వేల కోట్లు దోచుకున్నవారికి ప్రొటెక్షన్ ఇచ్చే పోలీసులు.. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడ్డారు. వెంటనే వారంతా ఎక్కడున్నారో అధికారికంగా సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.