విరాటపర్వం సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు హీరో రానా. ప్రచారానికి చాలా తక్కువ టైమ్ ఉండడంతో, యూనిట్ అంతా గట్టిగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు రానా. సినిమాలో కీలకమైన అంశాన్ని బయటపెట్టాడు. ఈ సినిమాలో మోరల్ డైలమా ఉందంటున్నాడు రానా.
“ఇప్పుడే కథ మొత్తం చెప్పలేను. రవన్న కానీ, దళం సభ్యులు కానీ, మరో ఉద్యమ నాయకులు కానీ కచ్చితమైన లక్ష్యంతో ఉంటారు. కుటుంబ, స్నేహ సంబంధాల కన్నా సమాజమే ముఖ్యమని జీవిస్తారు. ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా వెళ్తున్న రవన్న జీవితంలోకి వెన్నెల ప్రవేశిస్తుంది. ఇక్కడే ఒక మోరల్ డైలమా ఉంటుంది. ఒక లక్ష్యం కోసం పని చేయాలా? ఫ్యామిలీతో కలసి రిలాక్స్ అవ్వాలా? అనేది” అంటూ వివరించాడు.
విరాటపర్వం సినిమాలో తను హీరో కాదంటున్నాడు రానా. ఇందులో సాయిపల్లవే హీరో అంటున్నాడు. ఓ గొప్ప కథను చెబుతున్నామని, ఈ కథ చదివినప్పుడు సముద్రం అడుగులోకి వెళ్లిన ఫీలింగ్ తనకు వచ్చినట్టు చెబుతున్నాడు రానా.
ఇంత గొప్ప, నిజాయితీ కలిగిన కథలో భాగమైనందుకు తనకు గర్వంగా ఉందంటున్నాడు. జూన్ 17న థియేటర్లలోకి వస్తోంది విరాటపర్వం చిత్రం.