మనీ లాండరింగ్ కేసులో రానా ఆయూబ్ అనే మహిళా జర్నలిస్టు పై ఈడీ కొరడా ఝళిపించింది. యూపీలోని ఘజియాబాద్ ఇందిరాపురమ్ పోలీసు స్టేషన్ లో ఈమెపై దాఖలైన ఎఫ్ఆర్ ని పురస్కరించుకుని ఛార్జ్ షీట్ పెట్టింది. చారిటీ పేరిట ఈమె ప్రజల నుంచి పెద్దఎత్తున విరాళాలు సేకరించి వాటిని తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నట్టు ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అలాగే ఈమెపై ఛీటింగ్ కేసు కూడా దాఖలైంది. గతంలో రానాకు చెందిన రూ. 1.77 కోట్లను ఈడీ ఎటాచ్ చేసింది.
ఓ గ్లోబల్ మీడియా సంస్థకు పని చేసే రానా.. ‘కెట్టో డాట్ కామ్’ అనే వెబ్ సైట్ ద్వారా డొనేషన్స్ సేకరించి ప్రజలను మోసగించిందట. కోవిడ్ బాధితులకు సాయం కోసమంటూ సొమ్మును తీసుకుని పర్సనల్ అకౌంటుకు మళ్లించుకుందని ఈడీ వెల్లడించింది. స్వలాభాపేక్ష లేని ‘ప్రచారం’ పేరిట ఈమె 50 లక్షలకు ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించిందని ఈ సంస్థ వర్గాలు వెల్లడించాయి. మొదట సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేసి దాని ద్వారా ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది.
ధర్మ కార్యాలకు విరాళాలు కావాలంటూ రానా ఆయూబ్ ప్రజలను మోసగిస్తోందని గత ఏడాది ఆగస్టులో వికాస్ సాంకృత్యాయన్ అనే వ్యక్తి ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఈడీ ఈమె సేకరిస్తున్న డొనేషన్స్ పై దృష్టి పెట్టింది.
ఆమెపై ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రభుత్వాన్ని తరచూ విమర్శించే ఈమె తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ఈడీ విచారణ తనను వేధించడానికేనని ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే కక్ష గట్టి ఇదంతా చేస్తున్నారని కౌంటరిస్తోంది.