టాలీవుడ్ హీరో రానా సిటీ సివిల్ కోర్టులో హాజరయ్యాడు. ఫిలిం నగర్ లోని ఓ స్థలం వివాదానికి సంబంధించి నోటీసులు పంపగా.. న్యాయమూర్తి ఎదుట హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ లో 2,200 చదరపు గజాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని హీరో వెంకటేష్.. ఆయన సోదరుడు, రానా తండ్రి సురేష్ కలిసి కొనుగోలు చేశారని చెబుతున్నారు.
సురేష్, వెంకటేష్ కొన్న ఆ స్థలం అక్రమ కొనుగోలు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. 2014లో నగరానికి చెందిన ఓ వ్యాపారికి స్థలాన్ని లీజ్ కు ఇచ్చారు. దానికి సంబంధించి అగ్రిమెంట్ కూడా ఉంది. దాన్ని 2016లో, 2018లో రెన్యువల్ కూడా చేశారు. ఇలా కొనసాగుతుండగానే.. అందులోని 1,100 గజాల స్థలాన్ని రానా పేరు మీద రిజిస్టర్ చేశారు.
లీజ్ టైమ్ ఉండగానే స్థలం నుండి ఖాళీ చేయాలని ఒత్తిడి చేసి తనను ఆర్థికంగా నష్టపరిచారని ఆ వ్యాపారి ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే సిటీ సివిల్ కోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. కోర్టు రానాకు నోటీసులు జారీ చేసింది. దీంతో అతను కోర్టుకు హాజరయ్యాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే విరాటపర్వం సినిమాను విడుదల చేశాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే ఇంకోవైపు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనేక సినిమాలను నిర్మిస్తున్నాడు రానా. సాయిపల్లవి నటించిన గార్గి చిత్రాన్ని తెలుగులో ఈవారం రిలీజ్ చేస్తున్నాడు.