మానాడు.. తమిళనాట సూపర్ హిట్టయిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని అదే టైమ్ లో తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నించారు. తెలుగు వెర్షన్ కూడా సిద్ధం చేశారు. కానీ.. కోలీవుడ్ లో హిట్టవ్వడంతో, ఆఖరి నిమిషంలో తెలుగు వెర్షన్ రిలీజ్ అడ్డుకున్నారు నిర్మాత సురేష్ బాబు. ఈ సినిమా రైట్స్ తను దక్కించుకున్నారు.
అప్పట్నుంచి దీన్ని రానా చేస్తాడని కొందరు, నాగచైతన్య చేస్తాడని మరికొందరు చెప్పుకోవడం మొదలుపెట్టారు. దీనికితోడు మానాడు దర్శకుడు వెంకట్ ప్రభుతో నాగచైతన్య సినిమా ఓకే అవ్వడంతో, అంతా మనాడు రీమేక్ అనుకున్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చింది.
మానాడు తెలుగు రీమేక్ లో దగ్గుబాటి రానా నటించబోతున్నాడు. ఈ మేరకు చర్చలన్నీ పూర్తయ్యాయి. తమిళ్ లో శింబు చేసిన పాత్రను, తెలుగులో రానా పోషించబోతున్నాడు. తమిళ్ లో నటించిన కల్యాణి ప్రియదర్శన్ నే తెలుగులో కూడా హీరోయిన్ గా రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు.
హాలీవుడ్ మూవీ ఇన్ సెప్షన్ నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ ఇది. దీనికి ఇండియన్ టచ్ ఇచ్చాడు వెంకట్ ప్రభు. ఇలాంటి సినిమాలు తీయడంలో దిట్ట అనిపించుకున్న ఈ దర్శకుడు.. స్ఫూర్తి పొందిన కథలో కూడా తన మేజిక్ చూపించాడు. అలా చాన్నాళ్ల తర్వాత శింబుకు ఓ మంచి సక్సెస్ దక్కింది. తెలుగులో కూడా రానాకు ఇది మంచి సక్సెస్ అందిస్తుందని ఆశిస్తున్నారు.