ప్రశ్న: పవన్ కల్యాణ్ ఉన్నారని భీమ్లానాయక్ లో నటించడానికి ఒప్పుకున్నారా లేక స్టోరీ నచ్చి నటించారా లేక అయ్యప్పనుమ్ కోషియమ్ చూసి అంగీకరించారా?
ఈ ప్రశ్నకు చాలామంది అనుకున్న సమాధానం పవన్ కల్యాణ్ వల్ల రానా వచ్చి ఉంటాడని. కానీ రానా మాత్రం అందులో నిజం లేదని కుండబద్దలు కొట్టాడు. నిజానికి తనకు ఎవరూ భీమ్లానాయక్ ఆఫర్ ఇవ్వలేదని, తనే నిర్మాతకు ఫోన్ చేసి ఆ సినిమా చేస్తానని రిక్వెస్ట్ చేశానని అన్నాడు.
“అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా చూసి నేనే వంశీకి ఫోన్ చేశాను. రైట్స్ వాళ్లు తీసుకున్నారని నాకు తెలుసు. డానీ పాత్రను చేస్తానని కోరాను. వంశీ కూడా హ్యాపీ ఫీలయ్యాడు. అప్పటికి కేవలం రైట్స్ మాత్రమే తీసుకున్నారు. ఎలాంటి ప్లాన్స్ లేవు. ఆ తర్వాత 4 నెలలైంది వంశీ మాట్లాడలేదు. ఇక నాకు కాల్ రాదనుకున్నాను. కట్ చేస్తే, వంశీ వచ్చి పవన్ కల్యాణ్ చేస్తున్నారని చెప్పాడు. ఇది చాలా పెద్ద సినిమా అయిపోయిందని నాకు అర్థమైంది. నేను అనుకున్నది ఒకటి, పవన్ వచ్చిన తర్వాత మరో లెవెల్ కు వెళ్లింది.”
అయ్యప్పన్ నాయర్ పాత్ర కోసం ఎవ్వర్ని తీసుకుంటారనే అంశంపై తను అస్సలు ఆలోచించలేదన్నాడు రానా. తనకు కోషి పాత్ర నచ్చిందని, మరో హీరో ఎవరైనా తను కోషి రోల్ చేయాలని ఫిక్స్ అయిపోయినట్టు తెలిపాడు. ప్రాజెక్టులోకి పవన్ కల్యాణ్ వచ్చారని తెలిసిన తర్వాత చాలా థ్రిల్ ఫీల్ అయ్యానని, ఆయనతో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా ఎదురు చూశానని తెలిపాడు రానా. హీరోయిజం ఎలా ఉంటుందో సెట్స్ లో కళ్లారా చూశానన్నాడు..