ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో భాగంగా రెండోరోజు రంగం కార్యక్రమం జరిగింది. అశేష భక్తజనం నడుమ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆమె శరీరంపై ఆవహించిన అమ్మవారు భవిష్యవాణి చెప్పారు. మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సంతోషంగా చేయడం లేదని, కానీ.. మీ సంతోషం కోసం పూజలు చేయండని పేర్కొన్నారు.
తనకు సరిగ్గా పూజలు జరపడం లేదన్న అమ్మవారు.. ప్రతీ ఏటా ఈ విషయాన్ని చెబుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా సక్రమంగా పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించాలని చెప్పారు. భక్తుల సంతోషం కోసం పూజలు అందుకుంటున్నానని.. అయితే.. అవి ఇష్టపూర్వకంగా అందుకోలేకపోతున్నానని అన్నారు.
తన పిల్లలైన గర్భణీ స్త్రీలకు, ఆడపిల్లను కడుపున పెట్టుకుని చూసుకుంటున్నానని పలికారు. ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నానని అన్నారు. ఏటికేటా తన రూపాన్ని మారుస్తున్నారని మండిపడ్డారు. స్థిరమైన రూపం కావాలని, అంతా కాజేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సంతోషంగా లేకపోయినా మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చూస్తున్నానని అన్నారు.
గుండె మీద చేయి వేసుకుని చెప్పండి..మీరు సరిగ్గా పూజలు చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. అందరికీ కనువిప్పు కలిగేందుకే ఈ కుంభవృష్టి వానలు కురిపిస్తున్నానని తెలిపారు.