సంచలన కథలతో రియల్ స్టోరీస్ ను తన సినిమాలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మరోసంచలన స్టోరీతో ప్రజల ముందుకు రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తీయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అది కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు వర్మ.
‘డేంజరస్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. అంతేకాకుండా.. నిజ జీవితం ఆధారంగా తీసే చిత్రం కావడంతో స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలకు దర్శకత్వం వహించి మెప్పించిన వర్మ.. తాజాగా.. మాజీ మంత్రి కొండా మురళి సురేఖ దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా ‘కొండా’ చిత్రాన్ని కూడా ఆయన తెరకెక్కించారు. ఈ బయోపిక్‌కు స్వయంగా కొండా దంపతులే నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ కొండ మురళి దంపతుల స్వగ్రామమైన హన్మకొండలోనే చిత్రించారు వర్మ. మరి సీఎం కేసీఆర్ బయోపిక్ ఎలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుందో చూడాలంటున్నారు విశ్లేషకులు.