ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు కొత్త ప్రధాని వచ్చేశారు. నూతన పీఎంగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రస్తుతం రణిల్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముందుగా రాజకీయ సంక్షోభానికి తెరదించి.. ప్రజల కష్టాలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చుక్కలనంటిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దేశంలో శాంతి భద్రతలను అదుపు చేయాల్సి ఉంది. వీటిలో ఆయన సఫలీకృతుడు అవుతాడా? లేదా? అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న.
రణిల్ విక్రమ సింఘే సాదాసీదా నేత కాదు. అపార అనుభవం ఉంది. గతంలో నాలుగుసార్లు ప్రధానిగా పని చేశారు. తొలిసారిగా 1993-1994 వరకు ప్రధానిగా పని చేశారు. ఆ తర్వాత 2001-2004, 2015-2018 అక్టోబర్ వరకు, 2018 డిసెంబర్ నుంచి 2019 వరకు ప్రధానిగా సేవలందించారు. దేశంలో సుస్థిరతను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రణిల్ ను ప్రధానిగా నియమించినట్లు యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు.
విచిత్రం ఏంటంటే.. గత ఎన్నికల్లో యునైటెడ్ నేషనల్ పార్టీ నేరుగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ.. శ్రీలంక జాతీయ జాబితా పార్లమెంటరీ సభ్యత్వం ద్వారా.. అంటే ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రకారం పార్లమెంట్ లో ఒక సీటు లభించింది. ఆ స్థానంలో రణిల్ పార్లమెంటులో అడుగుపెట్టారు. 1949 మార్చి 24న ఈయన జన్మించారు. కొలంబోలోని రాయల్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్, కొలంబో యూనివర్సిటీలో పీజీ చదివారు. న్యాయవాదిగా కెరీర్ ను ప్రారంభించి తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు.