రంజీ ట్రోఫీలో అరుదైన ప్రదర్శన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు హనుమ విహారి. ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నవిహారి.. తాజాగా ఒంటిచేత్తో పోరాటం చేసిన తీరు అబ్బురపరుస్తోంది. మధ్యప్రదేశ్ రంజీ క్వార్టర్స్‌లో తొలి రోజు ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బౌర్సర్ ధాటికి విహారి ఎడమ చేతి మణికట్టులో తీవ్ర గాయమైంది.
ఈ నేపథ్యంలోనే 16 పరుగుల స్కోరు వద్ద విహారి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. గాయం తీవ్రత కారణంగా ఇక బ్యాటింగ్ చేసే అవకాశం రాదని అందరూ భావించారు. కానీ విహారి మాత్రం మళ్లీ వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడటం.. అదీ ఒంటిచేత్తో పోరాటం చేయడంతో ఇప్పుడు అందరూ విహారి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.
జట్టుకు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే లక్ష్యంగా విహారి రెండో రోజు ఆఖరి బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. సాధారణంగా కుడిచేతి వాటంతో ఆడే విహారి.. లెఫ్ట్ హ్యాండర్‌గా మారాడు. కుడి చేత్తో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఓవైపు నొప్పి బాధిస్తున్నా లెక్కచేయక పోరాటం కొనసాగించాడు. 20 బంతులాడిన విహారి.. రెండు బౌండరీల సాయంతో కీలకమైన 27 పరుగులు చేశాడు.
అంతకుముందు రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) సెంచరీలతో రాణించారు. ఇక లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు ఫెయిల్యూర్ కావడంతో ఆంధ్రప్రదేశ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. ఇక హనుమ విహారి పోరాడిన తీరు ఈ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. విహారి సాహసోపేత ఇన్నింగ్స్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు.
హాట్సాఫ్ విహారి అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఓసారి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇలాంటి వీరోచిత పోరాటమే చేశాడంటూ నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. సలాం విహారి.. నువ్వు నిజమైన పోరాట యోధుడివి అంటూ కితాబిస్తున్నారు. టెస్టు క్రికెట్‌లో విహారి తనదైన ముద్ర వేస్తున్నాడని చెబుతున్నారు.