అజ్ఞాతంలో ఉన్న రేప్ కేసు నిందితుడు నిత్యానంద తాజాగా మరో వీడియో విడుదల చేశాడు. తాను స్థాపించిన హిందూ దేశం ”కైలాసం” గురించి వివరాలు వెల్లడిస్తూ నిత్యానంద తన ఫేస్ బుక్ పేజీలో వీడియో పోస్ట్ చేశారు. కైలాస దేశంలో పౌరసత్వం కోసం 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపాడు. గురువారం లోపు కైలాస దేశం ఏర్పాటుపై పూర్తి వివరాలు తెలియజేస్తానన్నారు. తన దేశంలో పౌరసత్వం కోసం ఎంక్వైరీ చేసే వారితో తమ ఈమెయిల్స్ నిండిపోతున్నాయని తెలిపారు. తాము తదుపరి వివరాలు వెల్లడించే వరకు ఓపికా పట్టాల్సిందిగా వీడియోలో కోరారు. కైలాస దేశం ఏర్పాటు కోసం చందాలు ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తన దేశంపై వస్తున్న విమర్శల వల్లనే దానికి ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చిందన్నారు. వాటిని విమర్శించే వాళ్లు డబ్బుల కోసమే ఆ పని చేస్తున్నట్టు తనకు అర్ధమవుతుందన్నారు. కైలాసం అనేది భౌగోళిక ప్రాంతం కాదని..అది ఒక ఆధ్యాత్మిక భావన అన్నారు నిత్యానంద. రేప్ కేసులో నిందితుడైన బాబా నిత్యానంద హిందూ దేశం కైలాసం ఏర్పాటు చేసినట్టు ప్రకటించి ఇటీవల మరోసారివార్తల్లో కెక్కారు.