ఎవరెస్టు శిఖరంపై అరుదైన పిల్లి జాతిని గుర్తించారు జంతు శాస్త్రవేత్తలు. సాధారణంగా మనం ఊర్లలో కనిపించే పిల్లుల కంటే అడవి పిల్లులు కొంచెం పెద్దగా, బలంగా ఉంటాయి. పల్లాస్ పిల్లులు కూడా అడవి పిల్లులే అయినా ఇవి ఊర్లలో పిల్లుల కంటే కూడా చిన్నవిగా ఉంటాయి. ఈ పల్లాస్ పిల్లులు మనూల్ లు అని కూడా పిలుస్తూంటారు.
ఇవి పరిసరాలను బట్టి బూడిద, బూడిద ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఈ పిల్లులను భూమిపైనే తొలిసారిగా 1776లో బైకాల్ సరస్సు పరిసరాల్లో పీటర్ సైమన్ పల్లాస్ అనే జంతు శాస్త్రవేత్త గుర్తించారు. అప్పటి నుంచి వీటికి పల్లాస్ క్యాట్స్ అనే పేరు వచ్చింది.
అలాగే వీటికి తలకు ఇరువైపుల చెవులు పొట్టిగా గుండ్రంగా ఉంటాయి. కాళ్లు పొట్టిగా ఉంటాయి. వీటి శరీరంపై పొడవాటి వెంట్రుకలు ఉంటాయి. తోక 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవుతో ఉంటుంది. అయితే వీపు భాగంలో ఉండే వెంట్రుకల కంటే ఉదర భాగంలో ఉండే వెంట్రుకలు రెండింతలు ఎక్కువ పొడవుతో ఉంటాయి.
ఎందుకంటే చల్లటి ప్రదేశాల్లో నివసించే ఈ పిల్లులను చలి తీవ్రత నుంచి కాపాడేందుకు ఈ పొడవాటి వెంట్రుకలు తోడ్పడుతాయి. ఈ పల్లాస్ క్యాట్స్ ఎక్కువగా హిమాలయాలు, టిబెట్ పీఠభూమి, ఇరానియన్ పీఠభూమి, దక్షిణ సైబీరియన్ కొండలు తదితర ప్రాంతాల్లో కనిపిస్తాయి.