డైనోసార్లు అంతరించిపోయి వందల ఏండ్లు గడిచిపోయింది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాటి ఆనవాళ్లు బయటపడుతూనే ఉంటాయి. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన రాక్షస బల్లులు, డైనోసార్ ఆనవాళ్లు మరోచోట బయటపడ్డాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాలోని డైనోసార్ ఫాసిల్ నేషనల్ పార్క్ లో జరుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధక బృందం తవ్వకాల్లో అరుదైన శిలాజం బయటపడింది.
డైనోసార్ గుడ్డులో మరో గుడ్డు ఇమిడి ఉన్న శిలాజం బాఘ్ ప్రాంతంలో లభించింది. ఇలాంటి గుడ్డు లభించడం డైనోసార్ శిలాజాల చరిత్రలో ఇదే ప్రథమమని ఢిల్లీ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వింతగా ఉన్న గుడ్డు లోపల మరొక గుడ్డు సాధారణంగా పక్షల గుడ్లలో కనిపించే వింత. అలాంటిది ఒక టిటనోసారస్ గుడ్డులో ఇలా అనేక షెల్స్ ఎలా ఏర్పడ్డాయనేది ఇప్పుడు పరిశోధనాంశంగా మారింది. డైనోసార్లకు, అప్పటి పక్షి జాతులకు మధ్య సంబంధమేమైనా ఉందా అనే కోణంలో పరిశోధక బృందం పరిశోధనలు చేస్తోంది.
డైనోసార్ల పునరుత్పత్తి వ్యవస్థ.. పక్షులు, మొసళ్లు, తాబేళ్లు, బల్లుల పునరుత్పత్తి వ్యవస్థను పోలినదేనా? అనే పరిశోధనలకు ఈ డైనోసార్ గుడ్డు ఉపయోగపడుతుంది. సరీసృపాలు, పక్షుల పునరుత్పత్తి వ్యవస్థలకు ఉన్న సంబంధాల గురించి కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఈ ఎగ్ షెల్స్ ను ఉపయోగపడతాయని చెబుతున్నారు సైంటిస్టులు.