రానున్న రెండు రోజుల్లో ఆకాశ దేశాన అద్భుతం చోటుచేసుకోనుంది. వేల సంవత్సరాల కిందట కనిపించిన తోక చుక్క మళ్ళీ కనువిందు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ వాసులు ఈ దృశ్యాలు మరింత స్పషంగా చూసే అవకాశం దక్కనుంది.
గ్రీన్ కొమెట్‌గా పిలిచే ఈ తోక చుక్కను ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విజయవాడ నగర ప్రాంతంలో స్పష్టంగా దర్శనమివ్వబోతుంది. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో చూడవచ్చు. మంచు యుగంలో 50 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోక చుక్క ప్రస్తుతం కనిపించనున్నట్లు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.
భూమిపై జీవం ఏవిధంగా ఏర్పడిందో అనే విషయాన్ని కూడా తోక చుక్కల ద్వారా తెలుసుకోవచ్చు. సౌర కుటుంబం ఏర్పడిన నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా భూమి మీదకు జీవాన్ని తోక చుక్కలే తీసుకువచ్చాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న తోక చుక్కను వేల సంవత్సరాల తర్వాత విజయవాడ నగర వాసులు తిలకించే అవకాశం ఏర్పడింది.