దేశంలో రాబందు జాతి అంతరించి పోతోంది. అలాంటి సమయంలో యూపీలోని ఈద్గా శ్మశానంలో అరుదైన రాబందు ఒకటి దర్శనమిచ్చింది. రాబందు తెల్లటి రంగులో ఐదు అడుగుల రెక్కలు కలిగివుంది. దీంతో దాన్ని ఆకారాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.
వెంటనే ఆ అరుదైన రాబందును స్థానికులు పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. అది హిమాలయన్ గ్రిఫ్ఫన్ రాబందు అని అధికారులు తెలిపారు. టిబెట్‌లోని పీఠభూమి ప్రాంతంలో ఈ రాబందులు ఎక్కువగా కనిపిస్తుంటాయని అధికారులు పేర్కొన్నారు.
ఇది 1200 నుంచి 5000 మీటర్ల ఎత్తులో ఎగరగలదు. వేల కిలోమీటర్ల దూరాన్ని కూడా చాలా సునాయాసంగా ప్రయాణిస్తుంది. టిబెట్, కాబూల్, భూటాన్, తుర్కిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు పశ్చిమ చైనా, మంగోలియా, హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ రాబందు వారం రోజులుగా అక్కడే కనిపిస్తోందని స్థానికులు తెలిపారు. దాన్ని పట్టుకునేందుకు అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. చివరకు ఈ రోజు దాన్ని పట్టుకున్నారు. సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందిచామన్నారు. వారు రాగానే దాన్ని వారికి అప్పగించామన్నారు.
అరుదైన జాతికి చెందినది కావడంతో ఆ తెల్ల రాబందును చూసేందుకు స్థానికులు పోటీ పడ్డారు. దాంతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.