ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల పక్షులు ఒక దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్తుంటాయి. ఇక మన దేశానికి కూడా సెప్టెంబర్ నెల నుంచి అనేక పక్షులు వలస వస్తాయి. కొన్ని రకాల ప్రత్యేకమైన పక్షులు మనకు పలు చోట్ల ఈ సీజన్‌లో కనిపిస్తాయి. అందులో భాగంగానే అస్సాంలోని టిన్‌సుకియా జిల్లాలో ఉన్న మగురి-మోటాపంగ్ బీల్ అనే ప్రాంతంలో ఓ అరుదైన జాతికి చెందిన పక్షిని తాజాగా కొందరు గుర్తించారు. దీంతో పక్షి ప్రేమికులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సదరు పక్షి బాతు జాతికి చెందినది. దాన్ని మాండరిన్ డక్ అంటారు. ఆ పక్షి మన దేశంలో ఇప్పటికి చాలా తక్కువ సార్లు కనిపించింది. కానీ రష్యా, చైనా, జపాన్ దేశాల్లో ఈ పక్షులు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఇక ఈ పక్షి చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఆడ పక్షుల కన్నా మగ పక్షులే అందంగా ఉంటాయి. మన దేశంలో దీన్ని తొలిసారిగా 1902లో డిబ్రు అనే నదిలో చూశారు. తరువాత మణిపూర్‌లో ఉన్న లోకతక్ లేక్‌లో 2013లో ఈ పక్షి మళ్లీ కనిపించింది. ఆ తరువాత 2014లో అస్సాంలో ఉన్న బక్స జిల్లాలోని మానస్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్‌లో కనిపించింది.
అయితే తరువాత దాదాపుగా 7 ఏళ్లకు ఇప్పుడు ఈ పక్షి మన దేశంలో కనిపించడం మళ్లీ పక్షి ప్రేమికులను సంతోషానికి గురి చేస్తోంది. ఆ పక్షి అంతరించిపోతున్న జాబితాలో లేదు. కానీ అరుదైన జాతికి చెందినది. ఆ పక్షులు అంత సులభంగా కనిపించవు. అందువల్లే అవి కనిపించినప్పుడు పక్షి ప్రేమికులు వాటిని చూసేందుకు, వాటిని తమ కెమెరాల్లో బంధించేందుకు ఎంత దూరం అయినా వెళ్తుంటారు. అందులో భాగంగానే పలువురు పక్షి ప్రేమికులు దాన్ని చూసేందుకు అస్సాం వరకు వెళ్తున్నారు. ఇక గత 3 రోజులుగా ఆ పక్షి కనిపించడం లేదు. దీంతో అది తిరిగి తన సొంత స్థలానికి వెళ్లిపోయి ఉంటుందని జువాలజిస్టులు భావిస్తున్నారు. ఏది ఏమైనా.. ఆ పక్షి చాలా ఏళ్లకు కనిపించడం నిజంగా అరుదైన విషయమే..!