ఉత్తరాఖండ్ అటవీ శాఖకు చెందిన పరిశోధక బృందం అరుదైన కీటకాహార మొక్కను కనుగొన్నారు. యూట్రికులేరియా ఫర్సెల్లటాగా పిలవడే ఈ మొక్కను పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మొదటిసారిగా గుర్తించినట్టు పరిశోధకులు వెల్లడించారు. చమేలి జిల్లాలో ఈ మొక్క తమకు లభించినట్టు ఛీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజీవ్ చతుర్వేది తెలిపారు.
ఇలాంటి మొక్కను ఉత్తరాఖండ్‌లోనే కాకుండా మొత్తం పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మొదటిసారిగా చూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ‘జర్నల్ ఆఫ్ జపనీస్ బోటనీ’లో దీని గురించి ఆర్టికల్ పబ్లిష్ అయినట్టు చెప్పారు. మొక్కల వర్గీకరణ, వృక్షశాస్త్రంపై 106 ఏళ్ల నాటి జర్నల్‌గా దీనికి మంచి పేరు ఉందన్నారు.
ఉత్తరాఖండ్ అటవీశాఖకు చెందిన ఆవిష్కరణ ఒకటి ప్రతిష్టాత్మక జర్నల్ లో ప్రచురితం కావడం తమకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రిమిసంహారక మొక్కల ప్రాజెక్టుల అధ్యయనంలో భాగంగా పరిశోధనలు చేస్తున్న సమయంలో ఈ మొక్క తమ కంటపడిందన్నారు. ఈ కీటకాహార మొక్క సాధారణంగా బ్లాడర్‌వార్ట్స్ అని పిలువబడే మొక్కల జాతికి చెందినదని చతుర్వేది వివరించారు.
ఈ మొక్కలో ప్రొటోజోవా, కీటకాలు, దోమ లార్వాలు, టాడ్ పోల్స్ లను ఆకర్షించడానికి అత్యంత అధునాతమైన అత్యంత అధునాతనమైన, అభివృద్ది చెందిన నిర్మాణాలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఈ మొక్కలు ఎక్కువగా మంచినీరు, తడి వుండే నేలల్లో కనిపిస్తాయన్నారు. సాధారణ మొక్కల కిరణజన్య సంయోగక్రియ విధానంతో పోలిస్తే వీటిలో ఆహారం సేకరించే విధానం వేరుగా ఉంటుందన్నారు. కీటకాలను ఆకర్షించి వాటి నుంచి ఆహారం, పోషణను ఏర్పాటు చేసుకుంటాయని పేర్కొన్నారు.