ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో అరుదైన రెండు తలల కోబ్రాను గుర్తించారు. వికాస్ నగర్ లోని ఓ ఇండస్ట్రియల్ యూనిట్ దగ్గర పాము కనిపించడంతో… అటవీశాఖ అధికారులకు ఫోన్ వచ్చింది. అదిల్ మీర్జా అనే స్నేక్ క్యాచర్ అక్కడకు వెళ్లగా చూసి షాకయ్యాడు. పాము రెండు తలలతో కనిపించింది.
తన 15 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కోబ్రాను చూడలేదని చెప్పాడు అదిల్. ఇది చాలా అరుదైన పాము అని వివరించాడు. ఈ రెండు తలల కోబ్రాను డెహ్రాడూన్ జంతు ప్రదర్శనశాలలోని రెస్క్యూ సెంటర్ కు పంపించారు. వైద్యులు పలు పరీక్షలు చేయనున్నారు. వాళ్లు ఇచ్చే రిపోర్టును బట్టి దాన్ని వదిలేయాలా లేదా అనేది నిర్ణయిస్తామని తెలిపారు అటవీశాఖ అధికారులు.
ఈ రకం కోబ్రాలను బైసెఫల్లీ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం కొనసాగుతున్నందున రాష్ట్రంలో నివాస ప్రాంతాల్లో.. పాములు కనిపిస్తున్నాయి. కొన్ని అరుదైన వాటిని గుర్తిస్తున్నారు అధికారులు.