రస్ అల్ ఖైమా… వైఎస్ హాయంలో ఈ పేరు ఎక్కువగా వినపడేది. బాక్సైట్ గనుల తవ్వకంతో పాటు వాన్ పిక్ ప్రాజెక్టులో కూడా భాగం అయిన ఈ సంస్థ, వైఎస్ మరణం తర్వాత కనుమరుగయ్యింది. తమను మోసం చేశారంటూ నిమ్మగడ్డ ప్రసాద్ పై కేసులు పెట్టడం, ఇటీవల నిమ్మగడ్డను సెర్బియా జైల్లో ఉంచటం అన్నీ చకచకా జరిగిపోయాయి.
కానీ ఇప్పుడు మరోసారి ఏపీలో రస్ అల్ ఖైమా పేరు వినపడుతుంది. పాత ఇష్యూను సెటిల్ చేసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా కమిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది. వివాదం పరిష్కారానికి ఏమి చేస్తే బాగుంటుందో సూచించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బాక్సైట్ సరఫరాకు ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి? అల్యూమీనియం ఫ్యాక్టరీ నడవడానికి ఏమి చేస్తే బాగుంటుంది? అంతర్జాతీయ వివాదం లేవనెత్తినందున కోర్టు బయట పరిష్కరించుకోవడానికి గల అవకాశాలు ఏమిటి? అనే అంశాలపై తగిన సూచనలు చేయాలని ప్రభుత్వం ఈ కమిటీని కోరింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిటీ ఇప్పటికే సమావేశమైంది. ఈ కమిటీ రస్ అల్ ఖైమా ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. ఈ వివాదం అంతర్జాతీయ పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అదే కంపెనీకి మళ్లీ బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది.