భారతీయ వంటకాలకు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఎంతో ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా భారతీయులు తినే పలు సంప్రదాయ వంటకాలు ఎంతో శక్తివంతమైనవి. అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే ఔషధ గుణాలు వాటిల్లో పుష్కలంగా ఉంటాయి. అలాంటి వంటకాల్లో దక్షిణ భారతీయులు ఎక్కువగా వండుకునే రసం కూడా ఒకటి. ఇందులో పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి ఎన్నో ముఖ్యమైన పదార్థాలను వేస్తారు. అందువల్ల అవన్నీ శరీర నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే ప్రస్తుతం ఈ రసానికి అమెరికాలో ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. ఎంతగా అంటే రసంకు సంబంధించిన వార్తలు అక్కడ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తమిళనాడులోని అరియలూర్ అనే ప్రాంతానికి చెందిన అరుణ్ అనే చెఫ్ 5 ఏళ్ల కిందట అమెరికాలోని న్యూజెర్సీకి ఉద్యోగం నిమిత్తం వెళ్లాడు. ఐహెచ్ఎం ట్రికీలో కేటరింగ్ విద్యను పూర్తి చేశాడు. అయితే అతను అమెరికాలోని అంజప్పర్ ప్రిన్స్‌టన్ హోటల్‌లో పనిచేస్తున్నాడు. కాగా కోవిడ్ పేషెంట్లకు ఇచ్చే ఆహారంలో అతను రసాన్ని కూడా చేర్చాడు. పేషెంట్లకు ఈ రసం ఎంతో మేలు చేస్తుందని భావించిన అతను కాంప్లిమెంటరీ డిష్ గా కప్‌లలో రసంను అందించాడు. అంతే.. రసం పట్ల అమెరికన్లు కూడా ఫిదా అయ్యారు. ఈ క్రమంలో రసం అక్కడ పాపులర్‌గా మారింది.
అలా అరుణ్ నిత్యం 500 నుంచి 600 కప్పుల వరకు రసంను పేషెంట్లకు అందిస్తున్నాడు. ఈ క్రమంలో అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, ప్రిన్స్‌టన్‌లలో రసంకు డిమాండ్ పెరిగింది. రసంలో ఉండే ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయని తెలుసుకున్న చాలా మంది రసంను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రసం అక్కడ ట్రెండ్ అవుతోంది. దానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా అరుణ్‌కు 2018లో బెస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ చెఫ్ గా అవార్డు కూడా లభించింది. ఈ క్రమంలోనే రసం అక్కడ పాపులర్ అవుతుందంటే అది అతని చలవే అని చెప్పవచ్చు.