– ఎమ్మెల్యే రసమయి హాట్ కామెంట్స్
– ప్రతిపక్షాలు, యువజన నేతలపై ఫైర్
– చెప్పులు కుట్టే జాతిలో పుట్టా..
– నా జోలికొస్తే ఒక్కొక్కరి చర్మం ఒలిచేస్తా..
– హాట్ టాపిక్ గా రసమయి కామెంట్స్
అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ తో హెడ్ లైన్స్ కు ఎక్కుతుంటారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ప్రతిపక్ష నేతలు ఆయనది అధికారమదం అంటుంటారు. యువజన నాయకులు కాస్త ఘాటైన విమర్శలు చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో చెప్పేదేముంది.. ఎమ్మెల్యేని ఓ రేంజ్ లో ఆడుకుంటూ ఉంటారు. అయితే.. తనను టార్గెట్ చేస్తున్న వారిపై రసమయి తాజాగా చేసిన కామెంట్స్ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
గన్నేరువరంలో లో పర్యటించిన రసమయి.. ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తాను చెప్పులు కుట్టే జాతిలో పుట్టానని.. తన జోలికొస్తే ఒక్కొక్కరి చర్మం ఒలిచేస్తానని అటు ప్రతిపక్షాలకు ఇటు యువజన సంఘాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా కాస్త ఆవేశపూరితంగానే మాట్లాడారు రసమయి. తాను మాటలు చెప్పే వాడిని కాదని చేతలతోనే సమాధానం చెబుతానన్నారు. రోడ్డు కోసం నిధులు మంజూరు అయిన తర్వాతనే ఇక్కడి సమావేశంలో మాట్లాడుతున్నానని చెప్పారు.
ప్రతిపక్షాలకు రోడ్డు కావడం ఇష్టం లేదని, అందుకే రాజకీయ లబ్ధి కోసం రోడ్డు సమస్యను ముందుకు తీసుకువచ్చి లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే. యువజన సంఘాలు సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రీతిలో పోస్టులు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. గన్నేరువరం మండలం ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నది తానేనని చెప్పారు.
శనివారం గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజి నుంచి గన్నేరువరం వరకు రోడ్డుపై గుంతలు పూడ్చేందుకు యువజన సంఘాల ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. జోలె పట్టి పలు గ్రామాల్లో తిరిగారు. తొలి రోజు వచ్చిన రూ.25 వేలతో గన్నేరువరం నుంచి మాదాపూర్ రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చారు. డబుల్ రోడ్డు వేయాలని పోరాటం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే రసమయి పట్టించుకోవడం లేదన్నారు యువజన సంఘాల నేతలు. కనీసం రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చడం లేదని మండిపడ్డారు. ఇటు సెస్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రతిపక్ష నేతలు రసమయిని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చర్మం ఒలిచేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.