మందు తాగి డ్రైవింగ్ చేయకూడదని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారటం లేదు. ముఖ్యంగా యువకులు పీకల దాక మద్యం సేవించి నిర్లక్ష్యంగా రోడ్లపై వాహనాలు నడుపుతున్నారు. యమ స్పీడ్‌తో రయ్.. రయ్‌మంటూ రోడ్లపై అడ్డొచ్చిన వారిని ఢీ కొట్టి.. లైట్ తీసుకో అంటూ వెళ్లిపోతున్నారు. భాగ్యనగరంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి మరో ఘటన గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
నగరంలోని కొండాపూర్‌లోని మసీద్ బండలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తుల్లో బీఎండబ్ల్యూ కారును ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులు బైక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కొత్తపేటకు చెందిన కే.విజయ్(30), ఘట్‌కేసర్‌కు చెందిన సూర్య(28)లుగా గుర్తించారు. వీరు గురువారం సాయంత్రం విధులు ముగించుకొని కొండాపూర్ ప్రాంతానికి వచ్చారు. గాయపడ్డ విజయ్, సూర్యలను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
కారులో ఉన్న యువకులను స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరు యువకులు నిహాల్, లోహిత్‌లుగా గుర్తించారు. మత్తులో ఉన్న వీరు పోలీసులపై తిరగబడడంతో వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు.
ఇక దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటకు చెందిన లోహిత్, కొండాపూర్‌కు చెందిన నిహాల్‌రెడ్డి ఇద్దరు స్నేహితులుగా గుర్తించారు. అమెరికాలో వీరిద్దరు బీటెక్ పూర్తి చేసి ఇటీవలే నగరానికి వచ్చారు. వీరు ఇరువురు గురువారం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగి సాయంత్రం కొండాపూర్‌లోని నిహాల్ ఇంటికి వస్తున్న సమయంలో బైక్‌పై వెళ్తున్న విజయ్, సూర్యల వాహనాన్ని ఢీకొట్టారు.
వీరికి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా.. కారు నడుపుతున్న నిహాల్‌కు 234 ఎంజీ, లోహిత్‌కు 501ఎంజీ వచ్చింది. వీరు మద్యంతోపాటు మత్తు పదార్థాలను తీసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై పార్లమెంటు సభ్యుడి స్టిక్కర్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.