కన్నడ నుంచి ఇంపోర్ట్ అయిన చిన్న సినిమాల హీరోయిన్‌లా ‘ఛలో’ సినిమాలో నాగశౌర్య సరసన అవకాశం దక్కించుకుని టాలీవుడ్ రంగప్రవేశం చేసింది రష్మిక మందన్నా. ఆ సినిమా సక్సెస్ అయింది కానీ తనకు అంతగా కలిసి రాలేదు. తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన గీతగోవిందం ఘన విజయం సాధించడంతో రష్మిక ఉన్నట్టుండీ టాలీవుడ్ దర్శకులకు, హీరోలకు గోల్డెన్ లెగ్ అనే రేంజ్‌కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నానితో దేవదాస్, మళ్ళీ విజయ్ కాంబినేషన్లో డియర్ కామ్రేడ్… ఇలా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్ కొట్టేసింది.
ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబుకు జోడీగా సరిలేరు నీకెవ్వరు, నితిన్ జోడీగా భీష్మ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది. తనకు తాజాగా ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చిందని వినిపిస్తోంది. తెలుగులో సూపర్‌హిట్ అయిన నేచురల్ స్టార్ నాని సినిమా “జెర్సీ” హిందీలో రీమేక్ చేస్తున్నారని ఎప్పటినుంచో వినిపిస్తూ వచ్చింది. ఆ సినిమాకు కూడా తెలుగు సినిమాను డైరెక్ట్ చేసిన గౌతం తిన్ననూరియే దర్సకత్వం వహిస్తాడట.
డియర్ కామ్రేడ్ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయం నమోదు చేసుకోకపోయినా, ఆ చిత్రంలో లేడీ క్రికెటర్‌గా తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అదే ఇప్పుడు రష్మికకు బాలీవుడ్ ఆఫర్ తెచ్చిపెట్టిందట. టాలీవుడ్ సూపర్ హిత్ సినిమా అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌తో బంపర్ హిట్ సొంతం చేసుకున్న షాహిద్ కపూర్ నటించబోతున్న ఈ జెర్సీ హిందీ రీమేక్‌లో నటనకు ఎంతో ఆస్కారమున్న హీరోయిన్ పాత్రలో రష్మిక ఓకే అయిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో ఇంకా ఏవైపు నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.