పుష్ప మూవీ.. దేశవ్యాప్తంగా హిట్టయిన సినిమా. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. దీంతో పార్ట్-2పై అంచనాలు మరింత పెరిగాయి.
అయితే.. పెరిగిన అంచనాలకు తగ్గ స్థాయిలో, యూనిట్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. సంక్రాంతికి ఇస్తామన్నారు. అది కూడా లేదు. చివరికి షూటింగ్ పై కూడా చాలామందికి అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప-2పై క్రేజీ అప్ డేట్ ఇచ్చింది హీరోయిన్ రష్మిక.
పుష్ప-2 సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉందని తెలిపింది. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ బ్యూటీ, తను ఫిబ్రవరి నుంచి పుష్ప-2 సెట్స్ లో జాయిన్ అవుతానని స్పష్టం చేసింది. పార్ట్-2 సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని అంటోంది రష్మిక.
మొదటి పార్ట్ లో ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించాడు. శ్రీవల్లితో లవ్ స్టోరీ వరకు ఉంది. రెండో పార్ట్ లో పుష్పరాజ్ భార్య శ్రీవల్లిగా రష్మిక కనిపించనుంది. మొదటి భాగంలో ఉన్నట్టుగానే, రెండో భాగంలో కూడా ఓ ఐటెంసాంగ్ ప్లాన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.