జనవరి 25 నుంచి జనవరి 29 వరకు ఐదురోజుల పాటు రాష్ట్ర పతి భవన్ సందర్శనను నిలిపివేయనున్నారు. ఈ ఐదు రోజులు సాధారణ ప్రజలను అనుమతించరు. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవంతో పాటు బీట్ ది రిట్రీట్ కార్యక్రమం కూడా ఉండడంతో రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. రిపబ్లిక్ డే, బీట్ ది రిట్రీట్ వేడుక ఉన్నందును జనవరి 25 – 29 వరకు రాష్ట్రపతి భవన్‌ను చూడ్డానికి వచ్చేవాళ్లకు అనుమతి లేదు అని తెలిపింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను పెంచారు.
భారత 74వ గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాహ్ ఎల్‌సిసి ముఖ్య అతిథిగా రానున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్‌గా రావడం ఇదే మొదటిసారి.
భారత సైన్యానికి చెందిన పలు దళాలు కర్తవ్య పథ్‌లో సోమవారం ఉదయం రిపబ్లిక్ డే పరేడ్ రీహార్సల్ నిర్వహించాయి. అయితే.. ఈ వేడుకల సందర్భంగా గౌరవ వందనంలో ఎలాంటి మార్పు లేదని రాష్ట్రపతి భవన్ పోయిన వారం ఒక ప్రకటనలో తెలిపింది