బంగారు తెలంగాణను కళ్ల చూడడమే కేసీఆర్ అక్ష్యం.. పేదవాడికి మెరుగైన వైద్యం అందించేందుకే ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ప్రతీ మీటింగ్ లో వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు ప్రగల్భాలు పలుకుతున్నారు. రాష్ట్రంలో ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలను అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనుషులకు ఏమో కానీ..ఎలుకలకు మాత్రం సదుపాయాలు కల్సించేందుకు ప్రభుత్వ చర్యలు ఉపయోగపడుతున్నాయని అంటున్నారు ప్రజలు.
వైద్యనగరిగా తీర్చిదిద్దుతామన్న వరంగల్ లో దారుణం జరిగింది. అయితే.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. పరిస్థితి విషమించడంతో అతన్ని ఐసీయూ లో ఉంచి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. కాగా.. ఐసీయూలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రోగి కాళ్లు, చేతులను ఎలుకలు కొరకడం కలకలం రేపుతోంది.
రోగి కాలు, చేతుల వేళ్లు ఎలుకలు కొరికేయగా.. తీవ్ర రక్తస్రావమైంది. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి పట్ల కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. 4 రోజుల క్రితం శ్రీనివాస్ ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అలాంటి ఓ రోగిని ఎలుకలు కొరికేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ కే తలమానికమైన ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం పట్ల రోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తే ఐసీయూలోనే ఎలుకలు కొరికి గాయపరచడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రగల్భాలు పలుకుతున్న మంత్రి హరీష్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చలగాటాలు ఆడొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి విషయంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. శానిటేషన్ కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేశామని తెలిపారు. పక్కనే కిచెన్ ఉండడంతో ఎలుకల బెడద ఉందని అన్నారు. అంతేకాకుండా పాత బిల్డింగ్ కావడం కూడా దీనికి ప్రధాన సమస్యగా ఉందని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎంజీఎం సూపరిండెంట్ శ్రీనివాసరావు.