మహిళలకు.. ముఖ్యంగా భారతీయ మహిళ మణులకు నగలు, చీరలు అంటే వల్లమాలిన ప్రీతి. దానికి కోసం భర్తలను సున్నితంగా సాధిస్తూ మొత్తానికి అనుకున్నది సాధిస్తుంటారు. అలా అనుకున్న నగలను సాధించలేక, ఆశతీరక ప్రాణాలు విడిచిన ఓ మహిళమణి ఈ జన్మలో ఎలుకగా పుట్టిందో ఏమో ! కేరళ రాష్ట్రం కాసర్ గడ్ లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో ఓ ఘటన జరిగింది.
ఓ ఎలుక నగల దుకాణంలోకి దూరి ఎవరూ లేని సమయంలో నెమ్మదిగా వెళ్ళి నెక్లెస్ దొంగిలించింది. ఎలుకలు అడిగి తీసుకోవడమంటే అత్యేశే అవుతుంది మరి!. దీన్ని దొంగతనంగా జమకట్టడం కూడా కరెక్టుకాదు, కావాలంటే ఎలుకకి నగలషాపులో ఓ ఆభరణం దొరికిందని సవరణ చేసుకోవచ్చు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది.షాపువాళ్ళ అమ్మకానికి కొన్ని నెక్లెస్ లను కస్టమర్లకు కనిపించే విధంగా డిస్ ప్లే లో పెట్టారు. అయితే, సడెన్ గా ఓ నగ మాయమైంది. దీంతో షాపు సిబ్బంది కంగారు పడ్డారు. ఆ నగ కోసం వెతకడం ప్రారంభించారు. షాప్ మొత్తం వెతికారు. కానీ, ప్రయోజనం లేకపోయింది.
దీంతో ఆ షాపు యజమాని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. అందులో కనిపించిన దృశ్యం చూసి ఓనర్ సహా సిబ్బంది షాక్ అయ్యారు. వారి నోట మాట రాలేదు. నెక్లెస్ చోరీ వాస్తవమే. కానీ, ఓ ఎలుక ఖరీదైన నెక్లెన్ ను ఎత్తుకెళ్లినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది.
అర్థరాత్రి.. షాపు సీలింగ్ నుంచి ఓ ఎలుక బయటకు వచ్చింది. సరిగ్గా దాని కన్ను డిస్ ప్లే లో ఉంచిన బంగారు నెక్లెస్ పై పడింది. ఆ నెక్లెస్ పై దానికి మోజు కలిగింది. ఎంతైన పూర్వజన్మ వాసన పుణికి పుచ్చుకున్న మూషికామణి కదా! క్షణం ఆలస్యం చేయలేదు. దాన్ని లటుక్కున నోట కరుచుకుని చటుక్కున మాయమైంది.
ఎలుక చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఖరీదైన నెక్లెస్ ను ఎలుక ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వాలెంటైన్స్ డే దగ్గర పడింది కదా..ఆ ఎలుక తన లవర్ కి గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇలా నగను చోరీ చేసి ఉంటుందని ట్వీట్ చేస్తున్నారు.