ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియా ప్రచారం తన వరకు చేరటంతో ఆయన స్పందించారు. ప్రచారాన్ని ఆపాలని, అవార్డుల కంటే దేశానికి సేవ చేసే అవకాశం రావడమే తాను అదృష్టంగా భావిస్తానన్నారు.
డాక్టర్ వివేక్ భింద్రా అనే ఓ మోటివేషనల్ స్పీకర్ రతన టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు. భారత పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డు ఇవ్వాలన్నారు. అంతేకాదు #BharatRatnaForRatanTata ప్రచారంలో చేరాలని పిలుపునిచ్చారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అవును ఆయనకు అవార్డు ఇవ్వాల్సిందేనంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
దీంతో రతన్ టాటా స్పందించారు. వారి అభిప్రాయాలను అభినందిస్తున్నానన్న రతన్ టాటా… ఇలాంటి ప్రచారాలను నిలిపివేయాలని కోరుతున్నానన్నారు. అన్నిటికన్నా భారతీయుడిగా దేశ అభివృద్ధి, శ్రేయస్సు కోసం తన వంతు సహకారం అందించే అవకాశమే రావటమే అదృష్టం అని వ్యాఖ్యానించారు.