రతన్ టాటా… వ్యాపార రంగంలో అందరికి సుపరిచితమైన వ్యక్తి. కేవలం వ్యాపారమే కాకుండా దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఈ సమాజానికి తన వంతు సేవ చేస్తున్నారు. ఆ దిగ్గజ వ్యాపార వేత్తకు సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా రతన్ టాటా పోస్టును నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
టాటా ఇండికా కారును ప్రారంభించి 25 ఏండ్లు అవుతోంది. ఈ క్రమంలో ఇండికా కారును ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ కారు పక్కన నిల్చుని ఫోటో దిగి షేర్ చేశారు. 25 ఏండ్ల క్రితం టాటా ఇండికాను ప్రారంభించడంతో దేశంలో స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడిందన్నారు.
అది తనకు ఎప్పుడూ మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తుందన్నారు. ఈ కారుకు తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోస్టు పెట్టిన కొద్ది గంటల్లోనే సుమారు 30లక్షల లైక్స్ వచ్చాయి.
1998లో ఇండికాతో టాటా మోటార్స్ సంస్థ తన ప్యాసింజర్ కార్ల తయారీని ప్రారంభించింది. అప్పట్లో ఈ కారు ఓ సెన్సేషన్ సృష్టించింది. కేవలం రెండేండ్లలో అమ్మకాల్లో రికార్డులు సృష్టించింది. క్యాబ్ సర్వీసులు ప్రారంభమైన తొలి రోజుల్లో ఇండికానే ఎక్కువగా ఉపయోగించేవారు.