పూరి జగన్నాధ రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసిపోయింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పూరీ జగన్నాధ రథయాత్ర జరగకపోవడంతో.. ఈసారి యాత్రలో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. ఈ యాత్రను తిలకించేందుకు రెండెళ్ల తర్వాత అవకాశం కల్పించడంతో గురువారం నుంచే భక్త జనసంద్రమైంది పూరీ నగరం.
ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో చేరుకుంటారు. ఊరేగింపునకు జగన్నాథుడి రథం నందిఘోష్, బలభద్రుడి రథం తాళధ్వజ, సుభద్ర రథం దర్పదళన్ లు సిద్ధమయ్యాయి. ఈ యాత్రకు దేశ నలుమూలల నుండి 15 లక్షల మంది భక్తులు హాజరు కానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే.. రథయాత్రలో తొక్కిసలాటకు తావు లేకుండా ఐదు అంచెల బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ సునీల్ బన్సల్ వెల్లడించారు. శుక్రవారం ఈ ప్రాంతాన్నంతా ‘నో ఫ్లయింగ్ జోన్’ చేయాలని విమానాశ్రయ యంత్రాంగాన్ని కోరామని తెలిపారు డీజీపీ.
పూరీ జగన్నాథ్ రథ యాత్ర సందర్భంగా కళాఖండాన్ని తీర్చిదిద్దారు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం అని సందేశం ఇచ్చేలా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇదిలా ఉంటే.. గుజరాత్ అహ్మదాబాద్ లోని జగన్నాథ్ మందిరంలోనిర్వహించిన మంగళహారతి కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు.. జగన్నాథుని ఆశీస్సులతో దేశ ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. రెండేళ్ల తర్వాత జరిగే ఈ రథయాత్ర కన్నుల పండుగగా ఉండబోతోందన్నారు మోడీ.