అమిత్ తివారీ హీరోగా భానుశ్రీ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నల్లమల. రవి చరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మార్చి 18న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతిని, సాధు జంతువులను ప్రేమిస్తూ… తనగూడెం లో నివాసం ఉంటున్న వారికి సహాయం చేస్తుంటాడు అమిత్. అలాగే వనమాలి పాత్ర లో నటించిన భాను శ్రీ ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే సాఫీ గా సాగుతున్న వీరి జీవితాల్లోకి కొన్ని సమస్యలు వస్తాయి. నల్లమల అటవీ ప్రాంతంలో అక్రమ వ్యాపారం చేసేవారికి ఎదురు తిరుగుతాడు అమిత్. ఆ ప్రాంతంలో జరిగే అక్రమ వ్యాపారం ఏంటి ? ఎందుకు చేస్తున్నారు? అమిత్ వారిని ఎలా ఢీ కొట్టాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇక సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డైరెక్టర్ రవి చరణ్ ప్రతిభ కనిపిస్తుంది. ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు రవి చరణ్ తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా ఎక్కడా ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ ఉండదు.ఎంతో అనుభవంతో ఉన్న దర్శకుడు చేసిన సినిమాల అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్ గురించి మాట్లాడకుండా బయటకు రాలేరు.
అలాగే నటీనటుల విషయానికి వస్తే.. అమిత్ తివారీ అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు విలన్ గా కనిపించిన అమిత్ ఈ సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని బయటికి తీసుకువచ్చాడు. ఈ కథ తో అన్ని రకాల ఎమోషన్స్ పండించే ఆస్కారం దొరికింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అమిత్ అద్భుతంగా రాణించాడు. మరోవైపు భాను శ్రీ…తనదైన గ్లామర్, డ్యాన్సుల తో ఆకట్టుకుంటుంది. అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, నాజర్, తనికెళ్ల భరణి వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫి సినిమాకు ఎట్రాక్షన్ గా నిలిచాయి. యాక్షన్ సీన్లు, అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ వేణు మురళీ అద్భుతంగా చూపించారు ప్రేక్షకుడికి మంచి ఫీల్ ను తీసుకువచ్చారు. అలాగే సిద్ శ్రీరామ్ పాడిన ఏమున్నావే పిల్ల పాట సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుంది. ఒక్కసారిగా థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయిస్తుంది.
మొత్తంగా మార్చి 18న రిలీజ్ అయిన సినిమాలలో నల్లమల ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. థియేటర్స్ లో ప్రతి సినీ అభిమాని, పర్యావరణ ప్రేమికులు చూడవలసిన సినిమా నల్లమల. అలాగే ఈ సినిమాకు 3/5 రేటింగ్ కూడా ఇవ్వొచ్చు.