విధినణిచే విస్ఫోటం అతడు.. - Tolivelugu

విధినణిచే విస్ఫోటం అతడు..

‘నేను జర్నలిస్ట్..’ అని చెప్పుకుంటూ.. కాస్తంత గర్వంతో, కంటికి మెరుపునిచ్చే ఆత్మవిశ్వాసంతో, అడ్డే లేని దూకుడుతో, అంతకు మించిన తెగువతో తెలుగునాట రెండు రాష్ట్రాల్లో ఎవరైనా ఇవాళ తలెత్తుకుని తిరగ్గల్గుతున్నారంటే అందుకు కారణమే అతడు. కొండంత ధైర్యమని రచయితలు చెబుతుంటారే అదిగో ఆ ధైర్యానికి రూపమే అతడు. వేలాది జర్నలిస్టుల జీవితాలను మార్చింది అతడు. తెలుగు రాష్ట్రాల మీడియా రంగంలో ఒక ఉద్యమకారుడు అతడు. ఇవాళ పద్నాలుగు తెలుగు న్యూస్ ఛానళ్లు నడిచే బాటకు రాళ్లేసి కాంక్రీట్ పోసి దారిచేసింది అతడు. పాత- రోత-ముతక స్థాయి బ్రాడ్‌కాస్ట్ జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించింది అతడు.

అతడు మధ్యాహ్న సూరీడు. నడిరేయిలో వెలుగుదివ్వె. వేకువజామున తొలివెలుగు. అతడు అతడే.. మీడియా ట్రెండ్‌సెట్టర్.. పేరు పెట్టి పిలవాలంటే.. రవిప్రకాశ్…

తెలుగునాట రవిప్రకాశ్ వేసిన ఒక చిన్న విత్తనం పెరిగి మొక్కయ్యింది. పెంచిన ఆ మొక్కే పెరిగి పెరిగి పెద్ద వటవృక్షంగా మారింది. అది ఇవాళ ఎంతోమంది జర్నలిస్టులకు బతుకునిచ్చింది.

సంస్థలు స్థాపించి ఎదిగిన మనుషులు ఎంతోమంది ఉంటారు. సంస్థ పేరే ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తులు చాలా కొద్దిమందే వుంటారు. అలాటివారే రవిప్రకాశ్.

రవి నెలకొల్పిన టీవీ9 పదిహేనేళ్లు ఒక ప్రభంజనంలా సాగింది. ప్రసార మాధ్యమాన్ని పరుగులు పెట్టించింది. ఎవరూ తుడిచివేయలేని రికార్డులు సృష్టించింది. తనే చరిత్రగా నిలిచింది. ఒకటా.. రెండా.. ఎన్నో స్కాములు బయటికొచ్చాయి. ఎంతోమంది నేతల తలరాతలు మారిపోయాయి. బడుగు, బలహీన వర్గాల బాధలు పదిమందికీ తెలిశాయ్. పేదల ఆకలి కేకలు ప్రపంచానికి వినిపించాయ్. ప్రభుత్వాలు వణికాయ్. పాలకులు కంగారుపడ్డారు.

ఇంతమార్పు కోసం ఇంతకీ టీవీనైన్ రవిప్రకాశ్ ఏంచేశాడని? జస్ట్.. బాధ్యతలు గుర్తుచేశాడు. మెరుగైన సమాజాన్ని సృష్టించే బరువైన బాధ్యతని తన భుజానికెత్తుకుని మోశాడు.

తెలుగు మీడియా రంగంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి.. తనే ఓ బ్రాండ్‌గా ఎదిగిన కథ వినాలని ఎవరికైనా అనిపించేలా..  రవిప్రకాశ్ తన కెరియర్‌లో ప్రతిమలుపుని ఆసక్తికరంగా ఉండేలా మలుచుకున్నాడు.

సుప్రభాతం నుంచి తేజ వరకు తన ఉద్యోగ జీవితమే తననో ఉద్యమ సూరీడులా మార్చింది. అప్పుడే బ‌షీర్‌బాగ్ కాల్పుల మధ్య అతనిలో ఒక స్పార్క్‌ బయటికొచ్చింది. తెలుగు వార్తా  ప్రసార రంగంలో అదొక అధ్యాయం. జర్నలిస్టులు ఇలా కూడా సాహసిస్తారా? వార్త కోసం కాల్పుల హోరులో.. తుపాకీ గుళ్ల వానలో.. వెరవక.. చెదరక ఒంటి చేత్తో కెమెరా మోస్తూ పరుగులు తీస్తారా.? అంటూ నిఖిలలోకం నివ్వెరపోయిన సంచలన క్షణాలవి.

ఆ త‌ర్వాత ఇక ఆ దూకుడు ఎక్కడా ఆగలేదు. ఓ మిస్సైల్‌లా ముందుకు దూసుకుపోవడమే.

2003 చివరి భాగంలో..  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3.. ఒక పాత భవంతిలో.. కొత్త లోకం సృష్టించడానికి శుభారంభం జరిగింది. ‘తేజ’ రవిప్రకాశ్ ఏదో న్యూస్ ఏజెన్సీ తీసుకొస్తున్నాడన్న వార్తతో ఒకరిద్దరు పాత్రికేయుల్లో కొద్దిపాటి చర్చ మొదలైంది. వారి ఊహలకు భిన్నంగా.. అనూహ్యంగా తెలుగునాట ఒక సరికొత్త న్యూస్ ఛానల్ అక్కడ పురుడు పోసుకుంది. హడావుడి లేదు. హంగు, ఆర్భాటాలు అసలే లేవు. బుల్లితెరపై టీవీనైన్ మెరుపులా మెరిసింది. ఒక చిన్న బృందంతో తెలుగు రాష్ట్రంలో సంచ‌ల‌నాలు సృష్టించడానికి రవిప్రకాశ్ సిద్ధమైపోయాడు. అప్పుడతను మధ్యందిన మార్తాండుడిలా వెలిగిపోతున్నాడు. ‘24 గంట‌ల న్యూస్ ఛాన‌ల్‌ అట.. ఎవరు చూస్తార్లే’ అని గొణుకున్న జనమే ‘ఏం వస్తోందో.. టీవీనైన్ పెట్టండి..’ అనుకునేలా మార్చేశాడు. అప్పటికే టెలివిజన్ వార్తా ప్రసార మాధ్యమంలో రామోజీ సంస్థ అడుగుపెడుతోంది. తను ఢీకొనేది ఒక మీడియా దిగ్గజంతో అని తెలుసు అతడికి. దేనికీ వెరవలేదు. వెనకాడలేదు. కొత్త ట్రెండు సృష్టించాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి.. వ్యక్తి నుంచి వ్యవస్థగా మారాడు. న్యూస్ రూమ్ నుంచి వెలువడే సంచలన ప్రసారాలు.. వాటి కోసం ర‌విప్రకాశ్ తీసుకునే సాహసోపేత నిర్ణయాలు… ఇవన్నీ తెలుగిళ్లల్లో టీవీనైన్ బ్యాంగ్ మార్మోగేలా చేశాయి.

ఇదంతా ఒక సాధారణ జ‌ర్నలిస్టుగా రవిప్రకాశ్ సాధించిన విజయాలు. ర‌వి సాధించిన స‌క్సెస్ చిన్నది కాదు. ప‌త్రిక‌లు, టీవీ ఛానల్స్ న‌డ‌పాలంటే చాలా ఓపిక వుండాలి. అంత‌కంటే దానిని భ‌రించే శ‌క్తి కావాలి. సంపద గల వాళ్లయితేనే ఇంత భారాన్ని మోయ‌గ‌ల‌రు.

నిత్యం సామాజిక ట్యాగ్ లైన్లతో జ‌నాన్ని చైత‌న్యవంతం చేసే ప‌నిలో, కుళ్లును కడిగేసే పనిలో నిమగ్నమైన రవిప్రకాశ్ ఛాన‌ల్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక భాష‌లకు విస్తరించింది. కంటెంట్ విష‌యంలో, ప్రజెంటేష‌న్ ఇవ్వడంలో, ఎప్పటిక‌ప్పుడు బ్రేకింగ్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్ చేయ‌డంలో అన్ని ఛాన‌ల్స్ కంటే ముందంజ‌లో ఉండటమే టీవీనైన్ సీక్రెట్. సంస్థని ఆ స్థాయికి తీసుకురావడంలో రవిప్రకాశ్ త‌న శ‌క్తిని ధారపోశారు. దానిని తీసుకెళ్లి నెంబ‌ర్‌వ‌న్‌ స్థానంలో నిల‌బెట్టారు.

రవిప్రకాశ్ తన బృందాన్ని తీర్చిదిద్దుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపారు. అందుకే అతని బృందంలో పనిచేసిన వారంతా ప్రతిభ గల జర్నలిస్టులనే ఇమేజ్ పొందగలిగారు.

ఇంతకూ రవిప్రకాశ్ ఏంచేశాడు?

అధికార మదమెక్కి విర్రవీగే పాలకుల్ని నిలదీశాడు. కాంట్రాక్టర్లు, వ్యాపారుల పాపాలను కడిగేశాడు. అధికారం కోసం అర్రులు చాచే.. అడ్డదారులు తొక్కే నేతల్ని సూటిగా ప్రశ్నించాడు. అవినీతిపరులను రోడ్డు మీద పరుగులు పెట్టించాడు. లక్షల కోట్లు గడించిన బడా నేతల బతుకులు బయటేశాడు. మంత్రాలతో మాయచేస్తూ జనం బలహీనతలతో ఆటలాడుకునే బాబాల బాగోతాలను బయటకు తీశాడు. జనం ప్రాణాలు తీసే ట్రావెల్ బస్సులపై జనం తరఫున పోరాడాడు. డిపాజిటర్ల సొమ్ము దిగమింగి చీట్ చేసిన చిట్‌ఫండ్ దుర్మార్గుల్ని చీల్చి చెండాడాడు. ఫ్లోరోసిస్ మహమ్మారి బారీనపడి వ్యాధిగ్రస్థులవుతున్న వైనాన్ని ప్రపంచానికి చాటి ఆ సమస్యకో పరిష్కారాన్ని వెతికాడు. వరదలొచ్చి కర్నూలువాసులు నిండా మునిగితే ఇంటింటికీ వెళ్లి ఫండ్ రైజ్ చేసి బాధితుల ఆకలి తీర్చాడు. గూడు చెదిరిన వారికి ఇళ్లు కట్టించి ఇచ్చాడు. సముద్రానికి దగ్గరలో.. ప్రపంచానికి దూరంగా సరైన వైద్యం అందని దివి గ్రామాల మధ్య ఖరీదైన కార్పోరేట్ హాస్పిటల్ కట్టించాడు.

భక్తి పేరుతో మోసాన్ని.. కులం మాటున కుతంత్రాల్ని.. రాజకీయం నీడలో దోపిడీని.. మతం ముసుగులో మారణహోమాన్ని సృష్టిస్తున్న వైనాల్ని తవ్వి తీశాడు. పాతబస్తీలో మైనర్ బాలికల్ని దుబాయి షేక్‌లకు అమ్మేస్తుంటే ఆ గుట్టు రట్టు చేయించాడు. పాస్టర్ల పేరుతో లోఫర్లు కొందరు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటుంటే ఆ బాగోతాల్ని బయటపెట్టాడు. అదీ రవిప్రకాశ్..

తన మీద పడ్డ రాళ్లు చూసి పిరికివాడు పారిపోతాడు.. ధీశాలి ఎదుర్కొంటాడు.. ఆ రాళ్లతోనే ఒక పెద్ద దుర్గం నిర్మించుకుంటాడు మేధావి..

రవి వస్తాడు.. కుళ్లును కడిగేసేందుకు మళ్లీ వస్తాడు.. కొత్త శక్తితో.. కొత్త ఉత్సాహంతో.. సరికొత్త వెలుగులతో వస్తాడు.

వుయ్ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే, సర్!

Share on facebook
Share on twitter
Share on whatsapp