ఔనా.. ఇది నిజమేనా.. మన మాస్ మహారాజేనా?
ఔను ! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మాస్ మహారాజా రవితేజ స్టిల్ చూస్తే ఎవరైనా ఇలానే హాశ్చర్యపోతారు. ఇది మనోడేనా? అని తప్పక అంటారు. ఏజ్ పైబడ్డ హీరోలు తమ ప్రతి సినిమాలో కాసింత కొత్తగా ఉండటానికి ట్రైచేస్తుంటారు. చెప్పాలంటే యంగ్ అండ్ యనర్జిటిక్‌గా కనిపించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖైదీ నంబర్ 150లో చిరు అరవై దాటినా ముప్పయ్‌లోనే ఆగిపోయినట్టు కనిపించాడుగా. అదే వరుసలో అందరూ ట్రయ్ చేస్తున్నారు. నేనేం తక్కువా అనుకుంటూ ఇటీవల ఫ్రెంచ్ గెడ్డంతో ఒక వెరైటీ లుక్కులో కనిపించి టాలీవుడ్ ఐరన్ మ్యాన్ అనిపించుకున్నాడు బాలయ్య.
ఇప్పుడు ఇక రవితేజ వంతు. తన లుక్ మార్చుకోవడం కోసం కిక్ 2 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు మాస్ మహరాజా. బరువు తగ్గడం, కాస్త జిమ్ చెయ్యడం, మేకప్, హెయిర్ స్టయిల్ మార్చడం… ఇలా ఎన్ని చేసినా కాస్త సన్నబడ్డట్టు కనిపించినా ముఖంలో మాత్రం ఏజ్ కనిపించేస్తోంది. అందుకే ఈసారి మరో కొత్త ట్రయలేదో వేసినట్టున్నాడు. నిఖిల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, అల్లు శిరీష్ నటించిన ‘ఒక్క క్షణం’ సినిమాల దర్శకుడు వి.ఐ.ఆనంద్‌తో రవితేజ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు.
“డిస్కో రాజా” అనే క్రేజీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కోసమే ఈ డిఫరెంట్ లుక్. కథాపరంగా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్‌లో రవితేజ యంగ్ రోల్ ఉంటుందట. ఆ రోల్ కోసమే రవితేజ బాగా కష్టపడి, స్ట్రిక్ట్ డైట్ చేసి ఇప్పుడీ రకంగా ట్రిమ్ చేసిన మీసం, సన్న గడ్డం లుక్‌లో ప్రత్యక్షం అయ్యాడు. ఈ లుక్కులో చూసినవారెవరికైనా రవితేజ వయసు ఓ ముప్పయ్ వుంటుందా అని అనుకోవాలని తాపత్రయం.
“నేల టిక్కెట్” నిర్మాత రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ డిస్కో రాజా సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో రవితేజకు జోడీలుగా “ఇస్మార్ట్ శంకర్” సక్సెస్‌తో మాంచి జోరు మీదున్న నభా నటేశ్ అండ్ “ఆర్.ఎక్స్ 100” సినిమాతో అందరి చూపుల్నీ తన వైపు తిప్పేసుకున్న పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు. స్టోరీపరంగా సినిమా అంతా చెన్నై నగరంలో జరుగుతుంది కాబట్టి విలన్ పాత్రకు తమిళ నటుడు బాబీ సింహాను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇదొక సైన్స్ ఫిక్షన్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్. ఇటీవలే విడుదల చేసిన ప్రీలుక్‌తో మంచి అంచనాలనే తెచ్చుకున్న డిస్కో రాజా సినిమా రవితేజ కెరీర్‌ని మళ్ళీ గాడిలో పెడుతుందని అనుకుంటున్నారు.