ఐపీఎల్ ప్రారంభం నుంచి 14 సీజన్ల వరకు చెన్నై జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు ధోని. ఇంకో రెండు రోజుల్లో 15వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే.. సంచలన ప్రకటనతో సీఎస్కే ఫ్యాన్స్ కు షాకిచ్చాడు ధోని.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ సోషల్మీడియా ద్వారా తెలిపింది. ఇకపై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై జట్టును ముందుకు నడపనున్నాడు.
ఇప్పటిదాకా ఐపీఎల్ లో ధోని 204 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. వాటిలో 121 విజయాలు ఉన్నాయి. అలాగే అతడి సారథ్యంలోనే నాలుగు సార్లు(2010, 2011, 2018, 2021) టైటిల్ గెలిచింది సీఎస్కే.
అలాగే.. ఇప్పటిదాకా చెన్నై జట్టు 11 సార్లు ప్లేఆఫ్ కు చేరగా.. అత్యధికంగా 9సార్లు ఫైనల్ ఆడింది. కెప్టెన్ గా ధోని తప్పుకోవడం తమ జట్టుకు తీరని లోటు అంటూ సీఎస్కే యాజమాన్యం ట్వీట్ చేసింది. అటు చెన్నై అభిమానులు కూడా నిరాశచెందారు.