ఎల్బీ నగర్ గోవు ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్. ఇది ముమ్మాటికి ఎవరో కావాలని చేసిన పనేనని అన్నారు. ఆవు నోట్లో బాంబు పెట్టి పేల్చారని స్థానికులు చెబుతున్నా.. పోలీసులు ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు.
తీవ్రగాయాలతో ప్రాణపాయ స్థితిలో ఉన్న గోమాతకు వైద్యం అందించే విషయంలో పోలీసులు, పశుసంవర్థక శాఖ నిర్లక్ష్యం వహించడం వల్లే చనిపోయిందని ఆరోపించారు. వెంటనే జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. బాంబు పేల్చిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు శశిధర్.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం నాగోలులోని లలితానగర్ రోడ్డు నెంబర్ 6లో ముఖ భాగం పూర్తిగా ఛిద్రమైపోయిన స్థితిలో ఓ గోవు కనిపించింది. ఎల్బీనగర్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ ఆవును వ్యానులో ఎక్కించి ఫతుల్లాగూడలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. సాయినగర్‌లో ఉండే.. ఆవు యజమాని మల్లేష్ ఈ విషయం తెలుసుకుని సంరక్షణ కేంద్రానికి వచ్చాడు.
ఆవును సరైన చికిత్స కోసం పీపుల్ ఫర్ యానిమల్ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. అక్కడి నుంచి గోరక్షక్ సంస్థ ప్రతినిధుల సాయంతో మెరుగైన వైద్యం కోసం నారాయణగూడలోని సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా గోవు ప్రాణాలు నిలబడలేదు. ఈ క్రమంలోనే శశిధర్ పోలీసులు, పశుసంవర్థక శాఖ తీరును తప్పుబట్టారు.