బయట పెడతానంటే లోపలేశారు
◆ రవి ప్రకాశ్ అరెస్ట్ వెనుక
◆ ‘తొలి వెలుగు’ నోరు తెరిచే లోగానే
◆ టివి9 అమ్మకం వెనుక లావాదేవీల గుట్టు
◆ రూ.294 కోట్ల డ్రామా తేలేది ఎప్పుడు..?
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్, 9440000009)
మీడియా నీడలో ఆర్థిక పెద్దోళ్ళ ఆటలు. చూస్తుండగానే ఛానళ్ళు అన్నీ ఒకదాని వెంట ఒకటి ఒకేబాట పడుతున్నాయి. అందులో భాగంగా టివి9 కూడా చేతులు మారింది. ఎటు తిరిగి చూసినా వందల కోట్ల మాటే. అనంతర పరిణామాలు ఒక్కసారిగా బజారెక్కాయి. తొక్కాల్సిన వారు కోర్టు గుమ్మాలు తొక్కారు. పొందాల్సిన వారు బెయిళ్ళు పొందారు. తాత్కాలిక ప్రశాంతం. ఈలోగా మైహోం రామేశ్వరావుపై ఐటి దాడులు.. నిశ్శబ్దం.. రవిప్రకాష్ వెబ్ ఫోర్టల్ ద్వారా నటుడు శివాజీ ‘మేఘా’ బాగోతం బయట పెడతానంటూ ఓ ‘ప్రోమో’ గత కొన్నిగంటల క్రితం విడుదల. అంతే పరిణామాలు వేగంగా మారాయి. రూ.100 కోట్లు అలందా మీడియా నుంచి రవిప్రకాష్ తీసుకున్నట్లు ఆరోపణలు. కేసు నమోదు. అరెస్ట్..రిమాండ్.. ఈ వ్యవహారంలో వెలుగులోకి రాని విషయాలపై ‘ఆదాబ్ హైదరాబాద్’ సంచలన పరిశోధన కథనం యథాతధంగా ఇక్కడ ఇస్తున్నాం.
‘తొలి వెలుగు’ వెలగకుండానే..
‘తొలి వెలుగు’ పేరుతో వెబ్ పోర్టల్ రవిప్రకాష్ చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. ఈ వెబ్ సైట్‌కి రిలేటెడ్‌గా ‘వెలుగు’ అనే దిన పత్రికను కూడా తీసుకొచ్చేందుకు రవిప్రకాష్ చాలా కాలంగా ప్రయత్నించాడని తెలిసింది. అయితే వెలుగు అనేది పత్రికగా బయటకు రాకుండా రిజిస్ట్రేషన్‌కు మాత్రమే పరిమితమై’పో’యింది. ‘తొలి వెలుగు’ వెబ్ ఫోర్టల్‌లో నటుడు శివాజీ ఓ ‘ప్రమో’ వీడియో విడుదల చేశారు. అందులో వారానికి ఓ అవినీతి గుట్టు విప్పుతానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల సిఎంలు, ‘మెఘా’ ఇంజనీరింగ్ సంస్థ గురించి, కృష్ణారెడ్డి తెలంగాణ ప్రోజెక్టులలో 35వేల కోట్లు సంపాదించారని, ఆధారాలు బయట పెడతానని శివాజీ చెప్పారు. రీ డిజైన్, రివర్స్ టెండర్ల విషయాలు, ఓన్జీసి రిగ్గుల గుట్టు వారానికి ఒకటి చొప్పున విప్పుతానని ఆయన ప్రకటించారు. అంతే పరిణామాలు అనూహ్యంగా మారాయి.
తాజా అరెస్ట్:
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా రవిప్రకాష్ డబ్బులు తీసుకున్నట్లు అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు, మూడేళ్లలో సుమారు రూ.100కోట్లు తమ ఖాతా నుంచి తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి అలంద మీడియా పూర్తి అధారాలను పోలీసులకు సమర్పించింది. రవిప్రకాష్, కేబీఎన్ మూర్తి కలిసి పలు దఫాలుగా ఏబీసీఎల్ నుంచి నగదు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రవిప్రకాష్‌పై 409, 418, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రవిప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని సేకరించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్ ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
Box:
రూ.294 కోట్ల డ్రామా తేలేది ఎప్పుడు..?:
టీవీ9 అంచెలంచెలుగా ఎ’దిగిన’ సంస్థ. ఎలక్ట్రానిక్ మీడియాలో ఓ ప్రభంజనం. ఇది మొదటి పెట్టుబడితో హఠాత్తుగా రాలేదు. దాని వెనుక రవిప్రకాష్ కష్టం ఉంది. బ్రాండ్ విలువ కాలక్రమేణా సుమారు ఐదు వందల కోట్లకు చేరుకుంది.ప్రధానంగా టీవీ9 ప్రస్తుత ప్రమోటర్లైన అలంద మీడియా, పాత ప్రమోటర్ లు అయిన శ్రీనిరాజు సంస్థల మధ్య లావాదేవీలు జరిగాయి.”ఆగస్టు, 2018 నాటికి చింతలపాటి హోల్డింగ్స్, ఐల్యాబ్స్, క్లిపోర్డ్ ఫెరీరా, ఎంవీకేఎన్ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ఏబిసిఎల్ లో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24, 2018న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్ అనధికార విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్ పర్చేజ్ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని, నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది. 294 కోట్ల.లావాదేవీలలో కొనుగోలు చేసిన వారి దగ్గర టీవీ9 ఉంది. మరి అమ్మకం జరిపిన వారు అంత పెద్ద మొత్తం ఎక్కడ ఉంది. బ్యాంకుల్లో ఉందా..? లేక మరొకరి ఖాతోలోకి మళ్ళిందా..? అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఒప్పంద సంగతి రాష్ట్ర పోలీసులు తేల్చగలరా..? రవిప్రకాష్‌ను గంటలకొద్ది విచారణ చేసిన పోలీసులు భవిష్యత్తులో రవిప్రకాష్ సంధించే తొలి ప్రశ్న ఇదే. కేసులో ఈ రూ.294 కోట్ల చుట్టూ చట్రం తిరుగుతుంది. కీలకమైన ఈ డబ్బు మార్పిడి వ్యవహారం గురించి పోలీసులు లోతుగా విచారణ జరపాలి. కానీ ఇక్కడే కథ అడ్డం తిరుగుతుంది. అంత డబ్బు అమ్మకం దార్లు తిరిగి ఎక్కడ పెట్టుబడి పెట్టారనే విషయం స్థానిక విచారణ అధికారులు తేల్చగలరా..? అనేది బేతాళ ప్రశ్న.
నష్టాల నుంచి లాభాలు:
టీవి9 గత ఎన్నికల ముందు నష్టాల్లో ఉంది. అప్పటికే పాత యాజమాన్యం దాన్ని అమ్మాలని తెగ ప్రయత్నాలు చేసింది. బ్రాండ్ విలువ ఉన్నప్పటికీ రూ.209 కోట్లు నష్టొల్లో ఉంది. అయితే ఎన్నికల అనంతరం రూ. 239 కోట్ల లాభాలకు వెళ్ళింది. ఇది ఎలా జరిగింది..? ఇందులో ఉన్న పెద్ద తలకాయలు ఎవరివి..?