ఐపీఎల్ సీజన్ 2022 ఉత్కంఠగా సాగుతోంది. ఈ సీజన్‌లో టైటిల్ ఏం టీం సొంతం చేసుకుటోందని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటి వరకు సగం మ్యాచులు ముగియటంతో.. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు టాప్ 5లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ రేసులో నిలిచే జట్లపై టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి తన అంచనాలను వెల్లడించారు.
సన్ రైజర్స్ హైదరాబాద్.. సీజన్‌ను వరుస రెండు ఓటములతో ప్రారంభించి ఆ తర్వాత ఓటమి అన్నదే లేకుండా దూసుకుపోతోంది. వరుసగా ఐదు విజయాలు నమోదు చేసింది. అయితే, టోర్నమెంట్ ఆరంభమైన తర్వాత ఎంతో బలంగా తయారైన జట్టు ఇదేనని రవిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ మంచి ప్రదర్శన చేస్తున్నట్టు చెప్పారు. తనకున్న ఆటగాళ్ల పట్ల అతడు ఎంతో నమ్మకంతో ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో అతడు కోరుకున్నట్టుగా జట్టును నడిపించగలుగుతున్నాడని విశ్లేషించారు. ఇక, ఆటతీరును పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్ కూడా టైటిల్‌ను గెలుచుకునే అవకాశాలున్నట్టు రవిశాస్త్రి పేర్కొన్నారు.
‘కొత్త జట్టు టైటిల్ గెలుస్తుందని ఆరంభంలోనే చెప్పాను. లక్నో, గుజరాత్, ఆర్సీబీ.. వీటితోపాటు రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు వెళతాయి. రాజస్థాన్‌కు షేన్ వార్న్ మొదటి టైటిల్ తెచ్చి పెట్టాడు. ఈ ఏడాది అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ సభ్యులు ఆడుతున్నారు. అన్నీ అనుకూలిస్తే టైటిల్ ఖాయం’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.