(రావులపాటి సీతారాంరావ్, ప్రముఖ రచయిత, విశ్రాంత ఐపీఎస్ అధికారి)
అనుకోకుండా గుజరాత్ రాష్ట్రం వెళ్లాల్సివచ్చింది. నిరాసక్తతతోనే అక్కడికి చేరుకున్నాం కానీ.. తర్వాత గాంధీనగర్‌లోని సబర్మతి ఆశ్రమం, పోర్‌బందర్ చూసిన తర్వాత ఆ రాష్ట్రం మీద గౌరవం పెరిగింది.
పోర్‌బందర్‌లోని ఒక మూమూలు కుటుంబం నుంచి వచ్చిన మహాత్మాగాంధీ దేశ స్వాతంత్రానికి కారణం కావడం ఇప్పటికీ ఒక ఘన చరిత్రగానే చెప్పుకోకతప్పదు. అసలు ఆయనకు ఆ దృఢ సంకల్పం రావడానికి కారణం ఎక్కడో పర దేశంలో రంగు భేదంతో రైలులోంచి త్రోసివేయబడటం ఒకటి కావచ్చు కానీ.. ఆ సంఘటననే ఒక మామూలు మనిషి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చరిత్రలో పాఠ్యాంశంగా మిగిలిపోతుంది. సామాన్యుడు అసామాన్యుడిగా మారిపోవడం గాంధీజీకి జరిగిన యీ అనుభవం చెబుతుంది. ఆత్మాభిమానం దెబ్బతింటే కొందరు మరో దారిలోకి పోతారు. దానికి కారణం అయిన వారిని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తారు. అందుకే వారు సామాన్యులుగానే మిగిలిపోతారు. ఆ సమస్యను వ్యక్తిగతంగా మార్చుకొని రాగద్వేషాలకు బానిస అవుతారు.
కానీ, గాంధీ గారు సమస్యను వ్యక్తిగతంగా మార్చుకోలేదు. సమస్యను సంఘపరంగా ఆలోచించారు. తనకు జరిగిన పరాభవాన్ని జాతి పరాభవంగా భారతీయులు గుర్తించే విధంగా తన ప్రవర్తనను రూపుదిద్దుకోవడమే గాకుండా, జాతికి మార్గదర్శకులుగా నిలిచిపోయారు. మహాత్ముడిగా ప్రపంచం గుర్తించే రీతిలో ప్రవర్తిల్లారు. అందుకే జాతిపితగా కీర్తించబడ్డారు.
ఇలాంటి మనిషి భూమి మీద పుట్టి నడియాడాడన్నది భావితరాల వారు నమ్మడం కష్టం అని మేధావులు కీర్తించే స్థాయికి ఎదగడం, మహాత్ముడిగా భాసిల్లడం అనితర సాధ్యం అనిపిస్తుంది కానీ, కృషి వుంటే మనుషులు రుషులవుతారు అన్న నగ్నసత్యాన్ని గూడా గాంధీ జీవిత చరిత్ర చెబుతుంది. అందుకే ఆయన జీవితం అందరికీ ఒక సందేశమే!