‘ఆర్ఆర్ఆర్’ ఫేమ్ హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్ సన్(58) మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో రే స్టీవెన్ మరణించినట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ లో బ్రిటీష్ గవర్నర్ స్కాట్ బక్ స్టన్ పాత్రలో ఈయన నటించారు. స్టీవెన్ మరణ వార్త తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు షాక్ కు గురయ్యారు.
స్టీవెన్ సన్ మృతి పట్ల ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేసింది. ‘ఈ వార్త మమ్మల్ని ఎంతో షాక్ గురి చేసింది.. మీ ఆత్మకు శాంతి కలగాలి.. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు’.. అని ట్వీట్ చేసింది. పలువురు హాలీవుడ్, బ్రిటన్ ప్రముఖులు స్టీవెన్ కు నివాళులు అర్పిస్తున్నారు.
రే స్టీవెన్ సన్ ఉత్తర ఐర్లాండ్ లోని లిస్బర్న్ లో 1964లో జన్మించారు. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్ లో చదివిన తర్వాత రే స్టీవెన్ బ్రిటీష్ టెలివిజన్ లో కొద్ది సంవత్సరాల పాటు పనిచేశారు. అనంతరం 1998లో ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’తో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు.
1997లోనే రూత్ గెమ్మెల్ అనే హాలీవుడ్ నటిని రే స్టీవెన్ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2005లో విడిపోయారు. ఆ తర్వాత ఆయన ఆంత్రోపాలజిస్టు ఎలిసబెట్టా కరాకియాతో సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అనంతరం పలు టీవీ షోలతోనూ స్టీవెన్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆయన చివరిసారిగా నటించిన డీస్నీ+’అషోకా’ సిరీస్ త్వరలో విడుదలకు సిద్ధం కానుంది.